
శాక్య వంశానికి చెందిన క్షత్రియ యువరాజు గౌతముడు.. క్రీ.పూ. 563 ఆ ప్రాంతంలో ‘కపిల వస్తు’ నగరంలో జన్మించాడు. ఐదేండ్ల వయసులో గురుకులంలో చేరిన ఆయన బెస్ట్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. స్నేహితుడైన దేవదత్తుడికి గౌతముడి మీద అసూయ కలిగింది. ఒకరోజు గౌతముడు, ఉదయనుడు అంతఃపుర ఉద్యానవనంలో విహరిస్తుండగా ఆకాశంలో ఎగురుతున్న అడవి బాతుల గుంపులో ఒకదానికి బాణం తగిలి కింద పడిపోయింది. గౌతముడు దాని దగ్గరకు వెళ్లి బాణాన్ని తీసి, కట్టు కట్టాడు. అంతలో ఒక భటుడు వచ్చి ఆ బాతును దేవదత్తుడు దాన్ని తీసుకురమ్మన్నాడని చెప్పాడు. గౌతముడు ఆ పక్షిని ఇవ్వలేదు. దాంతో కోపంగా వచ్చిన దేవదత్తుడు బాతును ఇవ్వమని గట్టిగా అడిగాడు. తాను పక్షి ప్రాణాలు కాపాడాడు కాబట్టి తనదేనని అన్నాడు గౌతముడు. దాంతో దేవదత్తుడు ముని బాలకునిలా మాట్లాడుతున్నావే.. యువరాజంటే వేటాడాలి, ఆయుధాలు వాడాలి, యుద్ధంలో తన దేశ ప్రజల్ని కాపాడాలి అన్నాడు. అయినా పక్షిని ఇవ్వకపోవడంతో గౌతముడు పిరికివాడని, యుద్ధ విద్యల్లో ఆసక్తి లేదని ప్రచారం చేశాడు.
అది తెలిసిన వెంటనే తండ్రైన శుద్ధోధనుడు గౌతముడికి గుర్రపుస్వారీ, విలువిద్య, కత్తిసాము నేర్పించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు దేవదత్తుడితో విలువిద్యలో గెలిచాడు. రాజుగా పట్టాభిషేకం కాగానే ఆలస్యం చేయకుండా వివాహ ఏర్పాట్లు చేశాడు. వధువు దేవదత్తుడి సోదరి యశోధర. కొంతకాలం భోగ విలాసాలతో గడిపిన ఆయనకు సుఖాల పట్ల విరక్తి కలిగింది. చెన్నునితో రథంపై వెళ్తుండగా ఒక సన్యాసి కనిపించాడు. అతని ముఖంలో తేజస్సు, ప్రశాంతత తొణికిసలాడుతున్నాయి. ఆయన గురించి తెలుసుకున్న గౌతముడు తీవ్రంగా ప్రభావితుడయ్యాడు. తాను కూడా సన్యాసిగా మారి సత్యాన్వేషణ చేయాలనుకున్నాడు. తనలో ఆ ఆలోచన వచ్చిన కొద్దిరోజులకే యశోధర కొడుకుకు జన్మనిచ్చింది. దాంతో ఇంటికి తిరిగొచ్చాడు. కొడుకుకు రాహులుడు లేదా ప్రతిబంధకుడు అని పేరు పెట్టాడు. మనవడు పుట్టాడని శుద్ధోధనుడు గొప్ప విందు ఏర్పాటు చేశాడు.
28 ఏండ్ల గౌతముడికి విందు, వినోదాల మీద విరక్తి కలగడంతో ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు. వెంటనే చెన్నుణ్ని పిలిచి గుర్రాన్ని సిద్ధం చేయమని చెప్పి, చివరిసారిగా భార్య, కొడుకును చూసుకున్నాడు. అనోమ నదీతీరానికి వెళ్లి తన రత్నాభరణాలన్నీ తీసి, వాటిని గుర్రానికి కట్టి కపిలవస్తుకు వెళ్లమని చెన్నుడికి నచ్చజెప్పి పంపాడు. ఒంటరిగా మిగిలిన గౌతముడు జుట్టు కత్తిరించుకుని, దారిలో దుస్తులు సరిగా లేని వ్యక్తికి విలువైన తన వస్త్రాలు ఇచ్చాడు. నడుచుకుంటూ రాజగృహకు దగ్గరలో ఉన్న గుహల్లో నివసించే గురువులను పరిచయం చేసుకున్నాడు. వాళ్లు చెప్పిన ధర్మాలను పరీక్షించాలనుకున్నాడు. ఇప్పటి బుద్ధగయ ఆలయానికి దగ్గరలో ఉన్న ఉరువేల అడవికి చేరుకుని ఐదుగురు శిష్యులతో ఆరేండ్ల తపస్సు చేశాడు. ఒకనాడు సాధనలో ఉండగా మూర్ఛపోయాడు. మేలుకున్న తర్వాత వాళ్లకు ఏమీ తెలియదని గ్రహించి స్వయం శోధన పద్ధతిని విడిచి నైరంజన నది ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఒక యువతి దేవుని నైవేద్యాన్ని అతనికి పెట్టింది. ఆయన అక్కడే ఒక మహా(బోధి)వృక్షం కింద కూర్చుని నిద్రమత్తులోకి జారుకున్నాడు. మరునాడు మేల్కోనేసరికి మనసంతా స్వచ్ఛంగా, స్పష్టంగా మారింది. జ్ఞానం తానంతట తానే పొందాడు. వారణాసికి మూడు మైళ్లదూరంలో జింకల అరణ్యానికి వెళ్లి తన కొత్త సిద్ధాంతాన్ని బోధించడం మొదలుపెట్టాడు.
ఆయన శిష్యుల్లో 60 మందిని అనుచరులుగా ఎన్నుకున్నాడు. తిరిగి రాజగృహకు వెళ్లి మగధ రాజు బింబిసారుడిని ప్రభావితం చేశాడు. రాజుని మార్చడంతో ఆయన కీర్తి మారుమోగింది. తండ్రికి కొడుకు సత్యాన్వేషణ గురించి తెలిసింది. కొడుకుని చూడాలని మనుషులను పంపగా వాళ్లు కూడా ప్రభావితులై అక్కడే ఉండిపోయారు. ఒక చిరకాల మిత్రుడి ద్వారా కపిలవస్తుకు తిరిగి వెళ్లాడు. ఒక మునిగా, ఆహారం కోసం యాచిస్తూ వచ్చాడు. వారసుడిని రోడ్ల మీద యాచకుడిగా చూసి అవాక్కయ్యాడు శుద్ధోధనుడు. కొడుకును రాజమందిరానికి తీసుకొచ్చి భార్య, కొడుకును చూపించాడు. తర్వాత భార్య సన్యాసినీ శ్రేణిలో మొదటి వ్యక్తిగా చేరింది. కొడుకు కూడా బౌద్ధభిక్షువుగా మారాడు. గౌతముడికి 40 ఏండ్ల వయసులో తండ్రి జబ్బుపడ్డాడని తెలిసి కపిలవస్తుకు వెళ్లాడు. తల్లి కూడా సన్యాసినిగా మారింది. గౌతముడు మిగిలిన జీవితమంతా ఉత్తర భారతమంతా కలియతిరిగాడు. 80వ ఏట జబ్బు పడిన ఆయన దాన్ని లెక్క చేయకుండా ప్రయాణించి ‘ఖుషీ’ నగరం బయట ఒక తోపులో అంటే వారణాసికి120 మైళ్ల దూరంలో ఒక చోటికి చేరాడు. అక్కడ ఆయన చివరిసారి విశ్రాంతి తీసుకున్నాడు. ఒక బ్రాహ్మణుడిని మార్చిన ఆయన ‘అన్నింటికీ అంతం ఉంటుంది. ముక్తికి మీరే శ్రద్ధగా పాటుపడాలి’ అని చెప్పి స్పృహ కోల్పయాడు. తిరిగి లేవలేదు.
- మేకల
మదన్మోహన్ రావు
కవి, రచయిత