
తన పుట్టినరోజు నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ప్రారంభిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. నూతన సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్.. సచివాలయం దగ్గరలోనే నిర్మిస్తున్న ఆయన విగ్రహాన్ని మాత్రం పరిశీలించే పరిస్థితి కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు. ‘ మీ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించే అర్హత మీకు ఎవరు ఇచ్చారు..? సచివాలయం మీ ఆస్తి కాదు.. మీ జేబు ఆస్తి అసలే కాదు. అది ప్రజలందరి ఆస్తి. అటువంటి సచివాలయాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు కాకుండా.. మీ పుట్టిన రోజున ఎలా ప్రారంభిస్తారు. దీనిపై రాష్ర్ట ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది’ అని వ్యాఖ్యానించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ముందుగా బీజేపీ జెండా ఎగురవేశారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు బీజేపీ రాష్ర్ట ఇన్ చార్జ్ సునీల్ బన్సల్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, సీనియర్ నాయకులు విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, NVSS ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి, జీవితా రాజశేఖర్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మాచారి హాజరయ్యారు.
బీసీలను ఆత్మవంచనకు గురి చేసిండు
ఇప్పటి వరకూ పోడు భూముల సమస్యలను పరిష్కరించలేదని రాష్ర్ట ప్రభుత్వంపై బండి సంజయ్ మండిపడ్డారు. గిరిజన తండాలకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. కులవృత్తులను నాశనం చేశారని, బీసీల మధ్య కొట్లాటలు పెట్టించారని ఆరోపించారు. ఆత్మగౌరవ భవనాల పేరుతో బీసీలను ఆత్మవంచనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు ప్రధాని మోడీ 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తే వాటిని కూడా అమలు చేసేందుకు కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇవ్వడం లేదన్నారు. కేవలం 22 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారని, అది కూడా తప్పుల తడకగా ఇచ్చి, దేనికీ పనికి రాకుండా పోయాయని చెప్పారు.