ఎండాకాలంలో ఫ్రిజ్ వాడకం చాలా ఎక్కువ. ఆహారం, పాలు పాడవకుండా ఉండటానికి ప్రతీ ఇంట్లో ఫ్రిజ్ తప్పనిసరి అయిపోయింది. అయితే 100 మందిలో దాదాపు 80 మంది ఫ్రిజ్‌ను గోడకు ఆనించి చాలా దగ్గరగా పెడుతుంటారు. స్థలం ఆదా అవుతుందని అనుకుంటారు కానీ, దీనివల్ల ఫ్రిజ్ త్వరగా పాడవ్వడమే కాకుండా, ఓవర్ హీట్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.
ఫ్రిజ్‌కు ఎంత దూరం ఉండాలి?
ఫ్రిజ్ లోపల చల్లగా ఉండటానికి, దాని వెనుక భాగంలో ఉన్న కంప్రెసర్ వేడిని బయటకు వదులుతుంది. ఆ వేడి గాలి ఈజీగా బయటకు వెళ్లడానికి ఫ్రిజ్ చుట్టూ కొంత ఖాళీ స్థలం గాలి వీచేలా చాలా అవసరం.
నిపుణుల ప్రకారం ఉండాల్సిన కనీస దూరం ఎంతంటే... వెనుక వైపు గోడకు, ఫ్రిజ్‌కు మధ్య కనీసం 2 అంగుళాలు అంటే సుమారు 5 సెంటీమీటర్లు ఖాళీ ఉండాలి. పై భాగం ఫ్రిజ్ పైన క్యాబినెట్ లేదా స్లాబ్ ఉంటే కనీసం 1 అంగుళం ఖాళీ ఉండాలి. పక్క వైపులా కనీసం పావు అంగుళం (1/4 inch) ఖాళీ ఉండాలి.
శామ్‌సంగ్ కంపెనీ ఏం చెప్తోంది?
ఎలక్ట్రానిక్స్ సంస్థ శామ్‌సంగ్ కస్టమర్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ఫ్రిజ్ వెనుక వైపు ఇంకా రెండు పక్కలా కనీసం 50 మిల్లీమీటర్ల (సుమారు 2 అంగుళాలు) ఖాళీ ఉంచాలి. ఫ్రిజ్ పై భాగంలో కనీసం 100 మిల్లీమీటర్ల (సుమారు 4 అంగుళాలు) స్థలం వదలాలి.
ఉదాహరణకు: మీ ఫ్రిజ్ వెడల్పు 700 మిమీ ఉందనుకుంటే, దానికి రెండు వైపులా 50 మిమీ చొప్పున ఖాళీ ఇస్తూ, దాన్ని పెట్టడానికి మొత్తంగా కనీసం 800 మిమీ వెడల్పు ఉన్న స్థలాన్ని కేటాయించాలి.
ఇలా ఖాళీ ఉంచకపోతే ఏమవుతుంది?
వేడి బయటకు వెళ్లకపోతే, లోపలి భాగాలను చల్లబరచడానికి కంప్రెసర్ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల కరెంట్ ఎక్కువ కాలుతుంది, కరెంట్ బిల్లు పెరుగుతుంది. కంప్రెసర్‌పై భారం పడి ఫ్రిజ్ త్వరగా పాడైపోతుంది. ఫ్రిజ్ విపరీతంగా వేడెక్కిపోవడం (Overheating) వల్ల కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ లేదా పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి, వెంటనే మీ ఇంట్లోని ఫ్రిజ్‌ను పరిశీలించి, గోడకు కాస్త జరిపి సరైన దూరంలో ఉంచుకోండి!
