
హైదరాబాద్, వెలుగు: భూపాలపల్లి జిల్లాలో 250 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్‌ను అభివృద్ధిపేరిట వివిధ సంస్థలకు ఎలా కేటాయించారో వివరణ ఇవ్వాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫారెస్ట్ ల్యాండ్ అలకేషన్ ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని బుధవారం చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్‌చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో డివిజన్‌బెంచ్ విచారించింది. ఫారెస్ట్ ల్యాండ్‌తోపాటు సామాజిక వనాల కోసం నిర్దేశించిన కొండను ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించిందని, ఇందులో 25 ఎకరాల్ని కోర్టు బిల్డింగ్ కాంప్లెక్స్ కు కేటాయించిందని అదే జిల్లాకు చెందిన వెంపటి గంగా ప్రసాద్ పిల్‌ను దాఖలు చేశారు. హరిత హారం పేరుతో మొక్కలు నాటాలని చెప్పే ప్రభుత్వం డెవలప్‌మెంట్ పేరుతో భారీ చెట్లను నరికేస్తోందని పిటిషనర్ తరఫున లాయర్ శశిధర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక లాయర్ సంజీవ్ కుమార్ కోరారు. దీంతో కోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.