చంద్రబాబు మాత్రమే కాదు.. దేశంలో అరెస్ట్ అయిన సీఎంలు, మాజీ సీఎంలు వీళ్లే

చంద్రబాబు మాత్రమే కాదు.. దేశంలో అరెస్ట్ అయిన సీఎంలు, మాజీ సీఎంలు వీళ్లే

దేశంలో పలువురు ముఖ్యమంత్రులు... మాజీ ముఖ్యమంత్రులు అరెస్టైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అనేక కుంభకోణాలు, పలు కేసుల్లో ముఖ్యమంత్రులుగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే వారిని అరెస్ట్ చేశారు. మరికొందరిని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక అరెస్ట్ చేశారు. 

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా గతంలో అరెస్ట్ అయ్యారు. మైనింగ్ కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అలాగే మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ఆయనపై కేసు నమోదైంది. మధు కోడా 2006 నుంచి 2008 వరకు జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

జార్ఖండ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబు సోరెన్ కూడా అరెస్ట్ అయ్యారు. శిబు సోరెన్ వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా కిడ్నాప్, హత్యకు సంబంధించిన కేసులో శిబుసోరెన్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇదే కేసులో ఢిల్లీ హైకోర్టు శిుబు సోరెన్ ను  నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. శిబు సోరెన్..2005 ఒకసారి...2008 నుంచి 2009 వరకు ఒకసారి, 2009 నుంచి 2010 వరకు ఒకసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓ ప్రకాశం చౌతాలా కూడా జైలుకు వెళ్లారు. పాఠశాల ఉపాధ్యాయుల  నియామకాల్లో  అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుకు  సంబంధించిన స్కామ్‌లో  ఓ ప్రకాశ్ చౌతాలా దోషిగా తేలడంతో..ఆయన అరెస్ట్ అయ్యారు. ఓ ప్రకాశ్ చౌతాలా..1989, 1990, 1990 నుంచి -91, 1999 నుంచి -2005 వరకు సీఎంగా పనిచేశారు. 

బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ కూడా జైలుకు వెళ్లారు. పశువుల దాణా కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​కు శిక్ష పడింది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధించింది. బీహార్ కు లాలూ ప్రసాద్ యాదవ్ 1999 నుంచి 95 వరకు ఒకసారి, 1995 నుంచి 97 వరకు సీఎంగా విధులు నిర్వర్తించారు. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా అరెస్ట్ అయ్యారు.  చెన్నైలో ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. కానీ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చలేదు.
తమిళనాడుకు కరుణానిధి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1969 నుంచి -71, 1971 నుంచి -76, 1989 నుంచి -91, 1996 నుంచి -2001, 2006 నుంచి -11 వరకు సీఎంగా విధులు నిర్వర్తించారు. 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి  యడ్యూరప్ప కూడా అరెస్ట్ అయ్యారు. మైనింగ్ స్కామ్‌కు సంబంధించి పలు అవినీతి కేసుల్లో ఆయన్ను  అరెస్ట్ చేశారు.  కర్ణాటకకు యడ్యూరప్ప రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2007 ఒకసారి,  2008 నుంచి -11 వరకు మరోమారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

యూపీ మాజీ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ కూడా జైలుకు వెళ్లారు. ఎమెర్జెన్సీ టైంలో అప్పటి ప్రధాని  ఇందిరాగాంధీ  ఆయన్ను జైలులో వేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులందరినీ జైలులో పెట్టారు. చరణ్ సింగ్ 1967 నుంచి 68, 1970లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్లారు. క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆయన జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ నితిన్ గడ్కరీపై ఆరోపణలు చేశారు. నితిన్ గడ్కరీ అవినీతిపరుడంటూ ఆరోపించారు. దీంతో నితిన్ గడ్కరీ  కేజ్రీవాల్ పై  పరువునష్టం దావా వేశారు. అరవింద్ కేజ్రీవాల్ గతంలో 2013 నుంచి 14 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 

తాజాగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా అరెస్ట్ అయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో ఆయన్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబును కోర్టులో హాజరు పర్చనున్నారు.