బహుజనులపై అణచివేత  ఇంకెన్నాళ్లు? : కూరపాటి వెంకటనారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్

బహుజనులపై అణచివేత  ఇంకెన్నాళ్లు? : కూరపాటి వెంకటనారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్

గత ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలన్నింటినీ పాతర పెట్టి సామాజిక న్యాయం ఉనికి లేకుండా చేయడమే గాక ఈ వర్గాల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నది. మాట్లాడిన వారినందరినీ నిర్బంధాలకు గురి చేయడం, చిత్రహింసలు పెట్టిన ఉదంతాలు అనేకం బయటకొచ్చాయి. మొన్న ఎంపీ బండి సంజయ్​ను టెన్త్​ పేపర్ ​లీక్​కు సంబంధించిన కేసులో కక్షపూరితంగా, అమానవీయంగా, మధ్యరాత్రి నిర్బంధంలోకి తీసుకొని, వివిధ జిల్లాల్లోని అనేక పోలీస్ స్టేషన్లలో తిప్పారు.

లక్షలాదిమంది పదో తరగతి విద్యార్థులకు అశాంతి కలిగించి, వారి కుటుంబాలను ఆవేదనలో పడేసి ఒక వీరంగం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ పెద్దలు వారి సామాజిక వర్గాలకు సంబంధించిన వారు అక్రమ ఇసుక దందాలు చేస్తే, దాన్ని ప్రశ్నించిన వారిని పోలీసులతో ఉక్కుపాదం మోపించారు. రాష్ట్రంలో చట్టసభలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి పట్ల ఇంత కఠినమైన , అనాగరికంగా అమానవీయంగా వ్యవహరించిన ప్రభుత్వ వర్గాలు..  సాధారణ ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో, చేస్తారో కూడా అంచనా వేయవచ్చు.

అకస్మాత్తుగా తొలగింపులు

తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి నిరంతరం పోరాటంలో పాల్గొని రాష్ట్ర సాధనలో ముందు ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక నాయకులు మందకృష్ణను నిర్బంధంలోకి తీసుకొని జైలుకు పంపింది ఈ ప్రభుత్వం. ఈ ఘటన సీఎం కేసీఆర్​కు తెలియనది కాదు. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోర్ లీడర్ గా, ఆరు సంవత్సరాలు ఆర్థిక, ఆరోగ్య మంత్రిత్వ శాఖలను విజయవంతంగా నిర్వహించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు.

ఆయన ఆస్తులను వెంటాడటం, రాజకీయ భవితవ్యాన్ని బొంద పెట్టడానికి వేలకోట్ల రూపాయల ఖర్చుతో హుజూరాబాద్ లో ఓడించడానికి చేసిన ప్రయత్నం కేవలం బడుగు వర్గాల నాయకుల అభివృద్ధిని ఓర్చుకోలేక ఉన్నత స్థాయికి ఎదగకుండా చేయడమే అని రుజువు చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు.

స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంగా అకస్మాత్తుగా క్యాబినెట్ నుంచి తొలగించింది. అవమానపరిచింది కేవలం దళిత బహుజనుడనేనా? ఏ కారణంతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించిందీ తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు

ఇప్పటికీ అర్థం కాదు. 

ప్రభుత్వ విధానాలను సోషల్​మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్నను ఈ ప్రభుత్వం.. అనేక అక్రమ కేసులు పెట్టి, నెలల కొద్దీ జైలుపాలు చేయడం, వారి కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేయడం కొనసాగుతున్నది. తొలి వెలుగు రఘు, జర్నలిస్టు విఠల్, దాసరి శ్రీనివాసు బీసీ కులాలకు చెందిన వారనే కదా ఇంత వివక్ష, అణిచివేత? రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలను,

అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించినందుకే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి, జైలు పాలు చేస్తున్నట్లు బహుజన సామాజిక వర్గాలు భావిస్తున్నాయి. ఆకునూరు మురళి, ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు కూడా తెలంగాణ ప్రభుత్వ అధినేతల వివక్షకు గురయ్యారు. అవమానాలతో విసిగిపోయి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. 

మరో కార్యాచరణ కావాలి

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రారంభించిన ఎస్సీ, బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లలో చిల్లి గవ్వ లేకుండా చేసి, చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం అవసరమైన రుణాలకు, సబ్సిడీలకు దరఖాస్తులు చేసుకున్న దాదాపు 20 లక్షల మంది దళిత, బహుజనులకు ఏండ్లతరబడి మొండిచేయి చూపించడం రాష్ట్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనం. దాని వల్ల జరిగిన నష్టం ఎంతో అంచనా వేయగలమా? రాష్ట్రం వస్తే అభివృద్ధి చెందుతామని, సామాజిక న్యాయం పొందుతామని ఆశించిన తెలంగాణ రాష్ట్ర 90 % పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు బుగ్గిపాలయ్యాయి.

అణచివేతలు, నిరంకుశ, కుటుంబ, రాజరికపాలనపై ఉద్యమకారులు, విద్యావంతులు, నిరుద్యోగులు, మేధావులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  ప్రస్తుతం నెలకొన్న అయోమయం, ఆందోళన నుంచి బయటపడి ప్రజలను ఆవరించి ఉన్న ఈ బానిసత్వ, అరాచక పాలన నుంచి ప్రజలను, పేద వర్గాలను విముక్తి చేసే దిశలో ఆలోచించాలి. కార్యాచరణతో ముందుకు నడవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన విధంగానే వస్తున్న ఎన్నికల ముందు కూడా ప్రజలను చైతన్యం చేసి ఓటు మార్కెటు విష వలయం నుంచి విముక్తి చేసి సామాజిక న్యాయం ప్రజాస్వామ్య పాలన దిశలో అందరం ఆలోచించాలి.

అధికారులపై వివక్ష

సమర్థులైన బహుజన వర్గాల అధికారులను బయటకు పంపి లేదా అప్రాధాన్య పోస్టులకు పరిమితం చేసి, తమకు కావాల్సిన వారికి ప్రభుత్వ పెద్దలు అన్నీ ఇస్తున్నారు. విశ్రాంత అధికారులను అనేకమందిని వృద్ధాప్యంలో కూడా సేవల్లోకి తీసుకొని, నిజాయితీపరులైన బహుజన అధికారులపై కర్ర పెత్తనం చేయించడం వారు భరించలేని అవమానంగా పరిగణిస్తున్నారు.  కేవలం ముఖ్యమంత్రి తన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మాజీ ఎంపీ కలిస్తేనే ప్రణాళిక మండలి అవుతుందా?

వివిధ అంశాల్లో ప్రావీణ్యత కలిగిన నిపుణులకు, మేధావులకు ప్రణాళిక మండలిలో స్థానం కల్పించకుండా ఆ ఇద్దరితోటే సరిపోతుందా? ఇది ఏ సామాజిక న్యాయానికి, సమర్థవంతమైన పాలనకు సంకేతం అవుతుంది? తెలంగాణకు సంబంధించిన 90 శాతం అధికారులు వివక్షకు గురవుతున్న వారే. ఈ వర్గాల సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి అయి ఉన్నత స్థాయి పదవులను పొందకుండానే పదవీ విరమణ చేస్తున్నారు.

ఆధిపత్య కులాలకు  లేదా అస్మదీయ సామాజిక వర్గానికి సంబంధించిన విశ్రాంత అధికారులను లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి సలహాదారులుగా పెట్టుకోవడం ఏ సామాజిక న్యాయానికి సంకేతం ఇస్తున్నదని తెలంగాణ బహుజన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు.  - కూరపాటి వెంకటనారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్