భూములు ఇంకెన్నిసార్లు గుంజుకుంటరు?

భూములు ఇంకెన్నిసార్లు గుంజుకుంటరు?
  • ఇప్పటికే వరద కాలువ, కాళేశ్వరం లింక్​–1 కింద భూములు కోల్పోయిన రైతులు
  • తాజాగా కాళేశ్వరం లింక్-2 కోసం భూసేకరణ చేస్తున్న ఆఫీసర్లు
  • మార్కెట్​లో ఎకరాకు రూ.30 లక్షలు.. సర్కారు ఇస్తోంది రూ.8లక్షలు
  • ప్రాణం పోయినా మళ్లీ భూములివ్వమంటున్న రైతులు
  • ఎక్కడికక్కడ సర్వేను అడ్డుకొని ఆందోళన కార్యక్రమాలు 

జగిత్యాల, వెలుగు: కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్​కు మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు ప్రభుత్వం రూ.21 వేల కోట్లతో టెండర్లు పిలవగా పనులను మేఘా కంపెనీ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కన్నెపల్లి పంప్​హౌస్​ వద్ద రూ.500 కోట్లతో ఆరు మోటార్లను బిగించారు. ఈ మోటార్ల ద్వారా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోశాక కోటిలింగాల నుంచి మల్లన్నసాగర్​కు వివిధ స్టేజీల్లో తరలిస్తారు. ఈ క్రమంలో అప్రోచ్​ చానల్స్​, గ్రావిటీ కెనాల్స్​, పైప్​లైన్స్​, లిఫ్టుల ఏర్పాటు కోసం జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భూములు సేకరిస్తున్నారు. గతంలో వరద కాలువ, ఆ తర్వాత కాళేశ్వరం లింక్​–1 కింద ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు లింక్​–2 కింద మరోసారి భూములు కోల్పోతుండడంతో సర్వే పనులను అడ్డుకొని నిరసన తెలుపుతున్నారు. గతంలో తాము కోల్పోయిన భూములకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఏ మూలకూ చాలలేదని, అప్పుసప్పు చేసి మళ్లీ భూములు కొంటే ఇప్పుడు వాటిని కూడా తీసుకోవాలనుకోవడం అన్యాయమని అంటున్నారు. 

1,200 ఎకరాల సేకరణ
కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపులో భాగంగా లింక్ –2 కింద మొదట జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటి లింగాలలో నిర్మించబోయే పంప్​హౌస్​ నుంచి పైపులైన్, ఓపెన్​కెనాల్స్​ద్వారా వివిధ దశల్లో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లి వద్ద వరద కాలువలో ఎత్తిపోస్తారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్​, గొల్లపల్లి, పెగడపల్లి మండలాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని రామడుగు, గంగాధర మండలాల్లోని వివిధ గ్రామాల్లో సుమారు 1,200 ఎకరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరాకు బహిరంగ మార్కెట్​లో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా పలుకుతోంది. కానీ ప్రభుత్వం ఎకరానికి రూ. 8 లక్షల చొప్పున చెల్లిస్తోంది. దీంతో రైతులు తమ భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం ఎకరానికి ఇచ్చే రేటుతో తమకు పావు ఎకరం కూడా రాదని, అప్పు చేసి కొందామన్నా బయట భూములు దొరకట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వ్యవసాయం తప్ప మరో జీవనోపాధి తెలియదని, ప్రభుత్వం ఎకరాకు రూ.30 లక్షలైనా లేదంటే  భూములకు బదులు భూములైనా ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్వేకు వచ్చిన ఆఫీసర్లను వెనక్కి పంపుతున్నారు.

మూడో టీఎంసీ ఎందుకంటున్న ప్రతిపక్షాలు 
కాళేశ్వరం పూర్తయ్యి మూడేండ్లు గడుస్తున్నా ఏనాడూ రోజుకు 2 టీఎంసీలను తరలించలేకపోయిన సర్కారు  రూ.21వేల కోట్ల ఖర్చుతో మూడో టీఎంసీ పనులు చేపట్టడం, ఇందుకోసం రైతుల భూములను బలవంతంగా గుంజుకోవడం అన్యాయమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా కరీంనగర్​, జగిత్యాల జిల్లాల్లో ధర్నాలకు, రాస్తారోకోలకు దిగుతున్నాయి. కేవలం సీఎం కేసీఆర్​ తన కమీషన్ల కోసం చేపడుతున్న ఈ పనులను వెంటనే ఆపాలని ఇటీవల కాంగ్రెస్​ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే వరద కాలువ కోసం ఓసారి భూములు కోల్పోయిన రైతుల భూములను మళ్లీ గుంజుకోవడం అన్యాయమని, వెంటనే సర్వే నిలిపివేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇల్లు, పొలం పోతదట
ఈ చిత్రంలోని రైతు పేరు మాడిశెట్టి రాజిరెడ్డి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లికి చెందిన ఈయనకు గ్రామంలోని సర్వే నంబర్ 101, 102లో రెండెకరాల పొలం ఉండేది. వరద కాల్వ నిర్మాణం కోసం గతంలో మొత్తం రెండెకరాలు పోయింది. అప్పట్లో ప్రభుత్వం పరిహారం కింద రూ. 1.5 లక్షలు అందజేసింది. దీనికి మరికొంత అప్పు తెచ్చి దగ్గర్లోనే 2 ఎకరాల పొలం కొని సాగు చేసుకుంటున్నాడు. తాజాగా లింక్-2లో భాగంగా ప్రస్తుతం ఆ  రెండెకరాలతోపాటు ఇల్లు కూడా పోతుందని సర్వే ఆఫీసర్లు చెప్పడంతో రాజిరెడ్డి దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. రైతులకు సాగునీరు ఇస్తామని చెబుతూ  తమ లాంటి రైతుల ఉసురు పోసుకుంటున్నారని కంటతడి పెడుతున్నాడు.

మాడిశెట్టి రాజిరెడ్డి, రైతు

మమ్ముల నిండా ముంచిన్రు
ఈ రైతు పేరు ఇనుగండ్ల సత్య నారాయణరెడ్డి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నామాపూర్. గతంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్​కోసం 20 గుంటల భూమి తీసుకున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం లింక్​-–2 కోసం 3.2 ఎకరాలు తీసుకున్నారు. ఇందుకోసం ఎకరానికి రూ.8 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్​లో ఎకరానికి రూ.25 లక్షలకు పైగా పలుకుతోంది. ప్రభుత్వం ఇచ్చిన నష్ట పరిహారంతో తనకు బయట ఎకరా భూమి కూడా రావట్లేదని సత్యనారాయణరెడ్డి వాపోతున్నాడు. ఇప్పటికి రెండుసార్లు భూములు తీసుకున్న ప్రభుత్వం తమ కుటుంబాలను నిండా ముంచిందని, తమకు ఇష్టం లేకున్నా బలవంతంగా భూములు లాక్కుంటోందని సత్యనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఇనుగండ్ల సత్య నారాయణరెడ్డి, రైతు

గుంట భూమి కూడా ఇవ్వం
మాకు రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో 8 ఎకరాల భూమి ఉండేది. గతంలో వరద కాలువ కోసం ప్రభుత్వం  ఐదు ఎకరాల భూమి తీసుకుంది. నారాయణపూర్ రిజర్వా యర్ పిల్ల కెనాల్ లో మరో 10 గుంటలు, గాయత్రి పంప్ హౌస్ కు మూడు గుంటలు పోయింది. ఇప్పుడు అదనపు టీఎంసీ కోసం మళ్లీ భూ సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో నాకు మిగిలిన మూడు ఎకరాల భూమి, ఇల్లు పోతదని అంటున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్న మా కుటుంబం ఏమైపోవాలె. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటదా? ఈసారి ఒక్క గుంట భూమి కూడా ఇవ్వం. ఎవరు వచ్చినా అడ్డుకుంటం.
-ఒంటెల శ్రీనివాస్ రెడ్డి, రామడుగు, కరీంనగర్ 

రాష్ట్రంపై 20 వేల కోట్ల అదనపు భారం
కాళేశ్వరం నుంచి ఇప్పటికే మంజూరు ఉన్న రెండు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే 360 టీఎంసీలను వాడు కునే చాన్స్​ ఉంటుంది. ప్రభు త్వం వాటినే ఎత్తిపోయలేక పోతోంది. అదనపు టీఎంసీ అవసరమే లేదు. కేవలం కమీషన్ల కోసమే కరీంనగర్, జగిత్యాల జిల్లా ల రైతుల పొట్టకొడుతున్నారు. కృష్ణా రివర్​మేనేజ్​మెంట్​బోర్డు ఏర్పాటైనా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కృష్ణా నదీ జలాలు దోపిడీకి గురవుతున్నాయి. సీఎం కేసీఆర్ కు చిత్త శుద్ధి ఉంటే ఇటీవల జరిగిన గోదావరి, కృష్ణా జాయింట్​బోర్డు సమావేశానికి హాజరై ఆంధ్ర రాష్ట్ర దోపిడీపై ప్రశ్నించేవారు.
-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల