ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీసీసీ పదవులు ఎవరికి దక్కేనో.. !

ఉమ్మడి నల్గొండ జిల్లాలో  డీసీసీ పదవులు ఎవరికి దక్కేనో.. !
  •     సూర్యాపేటకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..?
  •     యాదాద్రికి ప్రస్తుత అధ్యక్షుడు సంజీవరెడ్డి..?
  •     డీసీసీ కోసం నల్గొండ లో 20, సూర్యాపేటలో 16..
  •     యాదాద్రిలో 15 మంది అప్లికేషన్లు

నల్గొండ, యాదాద్రి వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు స్పీడ్​గా సాగుతోంది. ఆశావాహుల నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది. యాదాద్రి అధ్యక్షుడి  ఎంపికలో ఏకాభిప్రాయ దిశగా కసరత్తు సాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం భువనగిరిలోని జిల్లా ఆఫీసులో మీటింగ్​ కూడా జరిగింది. సూర్యాపేట అధ్యక్ష పదవి హుజూర్​నగర్​ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నల్గొండ పదవీ ఎవరికి దక్కుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

 గతంలో పార్టీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే నాయకులకే అద్యక్ష పదవీ కట్టబెట్టే అవకాశాలు ఉండేవీ. ప్రస్తుతం గతానికి భిన్న౦గాప్రజాస్వామ్య పద్దతిలో అధ్యక్షుడి ఎంపిక చేపట్టాలని రాహుల్​ గాంధీ సూచనలు చేయడంతో ఆ మేరకు అభిప్రాయ సేకరణ చేపట్టారు. అధ్యక్షుల ఎంపికపై  నియోజక వర్గాలలో ఏఐసిసి, పీసీసీ పరిశీలకులు అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. పలు దఫాలుగా ముఖ్యమైన పార్టీ లీడర్లతో వన్​ టూ వన్​ చర్చించారు. అభిప్రాయాలు తీసుకున్నారు. 

అధ్యక్ష పదవీ కోసం వివిధ వర్గాలకు చెందిన లీడర్ల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. అభిప్రాయాలను క్రోడీకరించిన అధిష్టానం ఆమోదంతో డీసీసీ అధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ముగిశాక మండల, బ్లాక్, గ్రామ స్థాయి కమిటీల నియామకం చేపడ్తారు. ఇందులో ముగ్గురి పేర్లను పరిశీలించి సామాజిక సమీకరణాల దృష్టిలో పెట్టుకొని నల్లగొండ బీసీ లేదా ఎస్సీ, యాదాద్రి ఓసీ, సూర్యాపేట జిల్లా జనరల్ లేదా బీసీలకు కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. 

నల్గొండ జిల్లాలో  20 అప్లికేషన్లు

నల్గొండ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆశావహులు పెద్ద ఎత్తున అప్లికేషన్లు చేసుకున్నారు. నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాస్,  టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి  చనగని దయాకర్, దైదా రవీందర్, రాజా రమేష్ యాదవ్, చామల శ్రీనివాస్, సుంకరబోయిన నరసింహ యాదవ్, పోకల దాస్, బోళ్ళ వెంకట రెడ్డి, దుడిపళ్ళ వేణుధర్ రెడ్డి, సిరాజ్ ఖాన్, గుంజ రేణుక, రుక్మరెడ్డి, సలీం, రామలింగంతో పాటు మొత్తం 20 మంది ధరఖాస్తు చేసుకున్నారు. 

సూర్యాపేటలో 16 మంది 

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు అనురాధ కిషన్ రావు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తండు శ్రీనివాస్ యాదవ్, అన్నేపర్తి జ్ణాన సుందర్, దరూరీ యోగానంద చారి, గుడిపాటి నర్సయ్య,  ధరవత్ వెంకన్న, యారగని నాగన్న, వీరమల్లు యాదవ్, అల్లం ప్రభాకర్ రెడ్డితో సహ మొత్తం 16 మంది ధరఖాస్తు చేసుకున్నారు.

యాదాద్రిలో 15..

యాదాద్రి జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు సంజీవరెడ్డి సహా 15 మంది అప్లికేషన్లు చేసుకున్నారు. వీరిలో పార్టీ సీనియర్లు తంగెళ్లపల్లి రవికుమార్​, పోత్నక్​ ప్రమోద్​ కుమార్​ ఉన్నారు. వీరితో పాటు శంకర్​ నాయక్​, తడక వెంకటేశ్​, నూతి రమేశ్, బర్రె జహంగీర్​, అతహర్​ ​ తదితరులు ఉన్నారు. 

సూర్యాపేటకు పద్మావతి రెడ్డి

ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు మరోసారి అవకాశం లేదని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్న చెవిటి వెంకన్న యాదవ్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అంటున్నారు. అయితే సూర్యాపేట అధ్యక్ష పదవిని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఇవ్వాలంటూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో డీసీసీ అధ్యక్షుడి పీఠం కోసం ఆశలు పెట్టుకున్న పటేల్ రమేశ్ రెడ్డికి వచ్చే అవకాశాలు లేకుండా పోయింది. 

 పైగా ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫార్వర్డ్​ బ్లాక్​ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నించిన సంగతిని ప్రస్తావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డికే డీసీసీ ఇవ్వాలంటూ అందరూ మద్దతు తెలుపుతుండగా నల్గొండ జిల్లా బీసీ లేదా ఎస్సీలకే కేటాయించే అవకాశం ఉండడంతో ప్రస్తుత టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న పున్నా కైలాస్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య పేర్లు
 వినబడుతున్నాయి. 

యాదాద్రికి సంజీవరెడ్డి..?

యాదాద్రి డీసీసీకి ప్రస్తుత అధ్యక్షుడు సంజీవరెడ్డి పేరే మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు సహా మొత్తం 15 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే డీసీసీ ఎంపికపై  ఆదివారం జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏఐసీసీ అబ్జర్వర్​ సురేశ్​ రౌత్​, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి మీటింగ్​ నిర్వహించారు. 

ఈ మీటింగ్​లో పాల్గొన్న  పలువురు ఆశావహులు కూడా ఎమ్మెల్యేలు బీర్ల అయలయ్య, కుంభం అనిల్​కుమార్​ రెడ్డి ఎవరిని సూచించినా తమకు అభ్యంతరం లేదని, వారు సూచించిన వ్యక్తికే  మద్దతు ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. అయితే కొత్తగా మరొకరిని ఎంపిక చేయడం కంటే ప్రస్తుత అధ్యక్షుడు సంజీవరెడ్డి వైపే ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.