- రూ.8 లక్షల ఆస్తి నష్టం
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో ఓ సింగరేణి కార్మికుడి ఇల్లు దగ్ధమైంది. శ్రీపతినగర్కు చెందిన కార్మికుడు తుమ్మ సదానందం ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్లగా ఆయన భార్య రమణి, అత్త బొందమ్మ ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉన్నారు. అయితే ఇంట్లో ఒక్కసారిగా మంటలు రేగడంతో అప్రమత్తమైన ఇద్దరు బయటకు పరుగులు తీశారు.
చుట్టుపక్కల వారు, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు సదానందం వాపోయాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై గోపతి నరేశ్ పరిశీలించి వివరాలు సేకరించారు.
