- నేటి మీటింగ్‌లోనే ప్రకటిస్తామన్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు
- కాంగ్రెస్‌లో చేరిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు
- ఏఐఎఫ్బీ కౌన్సిలర్ సైతం.. అదే బాటలో మరికొందరు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలపై ఉత్కంఠ నెలకొంది. 60 డివిజన్లకు గాను 44 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ చివరి క్షణం వరకు సస్పెన్స్ మెయింటెన్ చేస్తోంది. మేయర్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన పలువురు కార్పొరేటర్ల పేర్లు మేయర్ పదవికి తెరపైకి వచ్చాయి.
ప్రధానంగా తూముల నరేశ్ (14వ డివిజన్), ధర్ని మధుకర్ (32), పెంట రజిత (46), సల్ల రమ్య (54)తో పాటు రాచకొండ గోపాల్ రావు (10వ డివిజన్) పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గోపాల్ రావు మినహా మిగతా వాళ్లంతా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మనసులో ఎవరున్నారో బయటపడడం లేదు. దీంతో గత మూడు రోజులుగా మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులపై ఊహాగానాలు సాగుతున్నాయి. మేయర్ బీసీ కావడంతో డిప్యూటీ మేయర్ ఇతర సామాజికవర్గానికి కేటాయించే చాన్స్ ఉందని చర్చించుకుంటున్నారు.
నేడే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
సోమవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ ఆఫీసులో కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. సరిగ్గా అదే సమయంలో వారి పేర్లు వెల్లడించనున్నట్టు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. షిరిడి క్యాంపులో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుంటారు. అక్కడినుంచి మున్సిపల్ ఆఫీస్‌కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. కార్పొరేటర్లు చేతులు ఎత్తి తమ మద్దతు ప్రకటిస్తారు.
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కౌన్సిలర్లు...
కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎనిమిది సీట్లు గెలుచుకోవడం తెలిసిందే. ఆదివారం ఆ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 23వ డివిజన్ కర్రు శంకర్, 28 డివిజన్ అమృత రాజ్ కుమార్, 45 డివిజన్ దోమల సునీత, 47 డివిజన్ వెంకటసాయికృష్ణ కాంగ్రెస్‌లో చేరారు. అలాగే 26వ డివిజన్ నుంచి ఎఐబీఎఫ్ తరఫున గెలిచిన ఇరుగదిండ్ల రవి కూడా హస్తం గూటికి చేరారు. దీంతో కార్పొరేషన్లో కాంగ్రెస్ బలం 49కి చేరింది. రేపో మాపో మరికొందరు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది.
