కరీంనగర్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో పొలిటికల్ వార్.. ఎన్నికల బరిలో రెడీ అవుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్యానెల్స్

కరీంనగర్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో  పొలిటికల్ వార్..  ఎన్నికల బరిలో రెడీ అవుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్యానెల్స్
  •     ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ
  •     నవంబర్ 1న పోలింగ్ 
  •     ఎలక్షన్స్ పై కేంద్ర మంత్రి బండి, మంత్రి పొన్నం, మాజీ మంత్రి గంగుల దృష్టి

కరీంనగర్, వెలుగు :  కరీంనగర్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బరిలో తమ ప్యానెళ్లను నిలిపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మంగళవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకానుండడంతో డైరెక్టర్లుగా ఎవరిని నిలపాలనే విషయమై కసరత్తు ప్రారంభించాయి. కాంగ్రెస్ తరఫున ప్యానెల్ ను సిద్ధం చేయాలని, ఎలాగైనా బ్యాంకు పాలకవర్గాన్ని హస్తగతం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే కరీంనగర్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. 

ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా నేతలు కూడా తమ ప్యానల్ ను రూపొందించే పనిలో ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బరిలో నిలవనున్నారు. అలాగే అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పోటీలో ఉండాలా.. వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ నాయకులు కూడా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో సమాలోచనలు చేస్తున్నట్లు సమచారం.  

ఎనిమిదేళ్లుగా ఎన్నికల్లేవు.. 

ది కరీంనగర్‌‌ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 7,272 మంది ఓటర్లు, జగిత్యాల జిల్లాలో 2,015 మంది ఓటర్లు కలిపి మొత్తం 9,287 మంది ఓటర్లు ఉన్నారు. బ్యాంకు పాలకవర్గ పదవీకాలం 2017 ఏప్రిల్‌‌లోనే ముగిసింది. దీంతో ఎనిమిదేళ్లుగా ప్రభుత్వాలే ఇన్ చార్జి పాలకవర్గాలను నియమిస్తున్నాయి. విలాస్ రెడ్డి చైర్మన్ గా ఉన్న  ఇన్‌‌చార్జి పాలకవర్గ పదవీకాలం ఈనెల 14తో ముగిసింది. 

విలాస్ రెడ్డి హయాంలోనే కోరం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా గత ఆగస్టులో బ్యాంకు మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ సహా 15 మంది మాజీ డైరెకర్ల సభ్యత్వాలను రద్దు చేయడం వివాదాస్పదమైంది. సభ్యత్వం రద్దయినవారు కోర్టుకు వెళ్లడంతో సభ్వత్వాల రద్దు చెల్లదని ఆదేశాలు జారీ అయ్యాయి. 

కోర్టు ఆదేశాలతో ఎన్నికలకు.. 

బ్యాంకు సభ్యుడు ఒకరు ప్రస్తుతం ఉన్న ఇన్‌‌చార్జి పాలకవర్గాన్ని రద్దు చేసి, అధికారులతో ఇన్​చార్జి కమిటీ వేసి పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో కేసు వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి 10 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని రెండు నెలల క్రితం కోర్టు అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరించి, 24న నామినేషన్లు పరిశీలించనున్నారు. 

25న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. బరిలో ఉన్న అభ్యర్థులకు 25న గుర్తులు కేటాయిస్తారు. నవంబర్ 1న పోలింగ్ నిర్వహిస్తారు. కరీంనగర్ ఓట్ల కోసం కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల,  జగిత్యాల ఓటర్ల కోసం జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేశారు. పోలింగ్ అయిపోగానే అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. నూతన పాలక మండలిని నవంబర్- 4 లోపు ఎన్నుకుంటారు. 

బండి సంజయ్ ప్రస్థానం అర్బన్ బ్యాంకు నుంచే.. 

కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాల్లోకి వచ్చాక కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గానే తొలిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే కరీంనగర్ కో–ఆపరేటివ్ బ్యాంకు సహా పలు బ్యాంకులను నష్టాల సాకుతో మూసివేసేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో బ్యాంకు చైర్మన్ గా ఉన్న డి.శంకర్ తో కలిసి డైరెక్టర్ బండి సంజయ్ అర్బన్ బ్యాంకును కాపాడడంలో కీలక పాత్ర పోషించారనే పేరుంది. 

ఆ తర్వాతే  సంజయ్ కరీంనగర్ కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా,  ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ నివాసంలో మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్ తదితరులు సమావేశమై అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో ప్యానెల్ ను బరిలో దింపే అంశంపై చర్చించారు.