
- షాపుల వద్ద నిబంధనలు పాటించాలి
- బాంబులు కాల్చే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి
- ములుగు ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి
ములుగు, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పటాకుల దుకాణాలు ఆదివారం కిటకిటలాడాయి. కాగా, ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన క్రాకర్స్షాపుల్లో నిబంధనలు తప్పక పాటించాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 31 బాంబుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోనే 14షాపులు ఉండగా ఏటూరునాగారంలో 6, గోవిందరావుపేట, వెంకటాపూర్, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం మండలాల్లో కలిపి 11షాపులు ఉన్నట్లు వెల్లడించారు.
షాపుల వద్ద సేఫ్టీ పాటించాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ధరలకు విక్రయించరాదని, బాంబుల దుకాణాల్లో ఇసుక బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు బాధితలను వెంటనే ఆస్పత్రికి తరలించాలని ప్రజలకు సూచించారు. వ్యాపారులు అగ్నిమాపక నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.