బీసీలు రాజ్యాధికారం సాధించాలి : చిరంజీవులు

బీసీలు రాజ్యాధికారం సాధించాలి :  చిరంజీవులు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బీసీలు రాజ్యాధికారం సాధించాలని బీసీ ఇంటలెక్చువల్  ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు పేర్కొన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ లోని ఫంక్షన్  హాల్ లో ఆయన రచించిన ఇస్సా ఇజ్జత్  హుకూమత్  పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యమానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలని, బీసీల ఉద్యమానికి కావాల్సిన లక్ష్యాన్ని నిర్దేశిస్తూ వాటా, ఆత్మ గౌరవం, అధికారాన్ని సాధించడమే ఉద్యమ లక్ష్యమని తెలిపారు. 

విద్య,ఉద్యోగం, రాజకీయ, సినీ పరిశ్రమ, సిమెంట్  పరిశ్రమ, ఫార్మసీ, రియల్ ఎస్టేట్, పౌల్ట్రీ, బ్యాంకింగ్, నామినేటెడ్  పదవులు, న్యాయ వ్యవస్థ మొదలైన 30 రంగాల్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు చెప్పారు. అన్ని పార్టీలు 42 శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లు నటిస్తూ, బీసీలను మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. పచ్చిపాల సుబ్బయ్య, సంగిశెట్టి శ్రీనివాసులు, మల్లికార్జున్, బడే  సాబ్, చెన్న రాములు, విజయ్ కుమార్, భాస్కర్, వెంకటయ్య, మధుసూదన్ గౌడ్, లక్ష్మణ్ నాయక్, శరత్, నిరంజన్  పాల్గొన్నారు.

నల్ల కండువాలతో ర్యాలీ..

కల్వకుర్తి: 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కల్వకుర్తి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అంబేద్కర్  విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్​ చేశారు.