అధికారంలోకి వస్తం.. ఎగిరిపడుతున్నోళ్ల బెండు తీస్తం! : కేటీఆర్

అధికారంలోకి వస్తం.. ఎగిరిపడుతున్నోళ్ల బెండు తీస్తం! : కేటీఆర్
  • రెండేండ్లలో కేసీఆర్ 
  • మళ్లీ సీఎం అవుతరు: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండేండ్లలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్​ పార్టీయేనని.. కేసీఆర్ మళ్లీ​ సీఎం అవుతారని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న వాళ్ల బెండు తీస్తామని హెచ్చరించారు. కాంగ్రెసోళ్లు ఏదో అడ్డమారిగుడ్డిసూటిలో అధికారంలోకి వచ్చారని, అంతదానికే ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం పాశం యాదగిరి కూతురు పల్లవి, అల్లుడు అంజిబాబు కేటీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ను బీఆర్​ఎస్​ తొలి దెబ్బ కొట్టబోతున్నదని, రెండో దెబ్బ రాజేంద్రనగర్​ లేదా ఖైరతాబాద్​లో కొడతామని చెప్పారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని, ఆయన దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలని సవాల్​ విసిరారు. 

జూబ్లీహిల్స్​ ఎన్నిక ప్రభుత్వ విశ్వసనీయతకు పరీక్ష

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక.. ప్రభుత్వ విశ్వసనీయత, పాలన, శాంతిభద్రతలకు పరీక్ష అని కేటీఆర్​ అన్నారు. రెండేండ్లుగా ప్రజలకు ఉపయోగపడే పెద్ద ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వం నిలిపేస్తున్నదన్నారు. ప్రజలపైకి బుల్డోజర్లను ప్రయోగిస్తున్నదని.. రేవంత్​ పాలనలో బుల్డోజర్​ రాజ్​ వచ్చిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి హోంవర్క్​ లేకుండానే రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసిందని, కాంగ్రెస్​ మోసాన్ని కోర్టు ఎండగట్టిందని విమర్శించారు. కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడుకుంటున్నారని కేటీఆర్​ఆరోపించారు.