పాకిస్తాన్ తో ఇప్పటి వరకు 4 యుద్ధాలు.. ఏ యుద్ధం ఎన్ని రోజులు జరిగిందో తెలుసా.. మరి ఆపరేషన్ సింధూర్ ఎన్ని రోజులు..?

పాకిస్తాన్ తో ఇప్పటి వరకు 4 యుద్ధాలు.. ఏ యుద్ధం ఎన్ని రోజులు జరిగిందో తెలుసా.. మరి ఆపరేషన్ సింధూర్ ఎన్ని రోజులు..?

పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ దాడిలో 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలొస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో రెచ్చిపోయిన పాకిస్తాన్ కు ఆపరేషన్ సిందూర్ తో బుద్ధి చెప్పింది భారత్. ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయిన క్రమంలో దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు ప్రజలు. తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు పహల్గాం ఉగ్రదాడి బాధితులు. అయితే.. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఇప్పటిదాకా ఎన్ని యుద్దాలు జరిగాయి.. అప్పటి పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1947 యుద్ధం:

1947లో భారత్ పాకిస్తాన్ మధ్య మొదటి యుద్ధం జరిగింది.. ఈ యుద్ధం 12 నెలల 10 రోజుల పాటు జరిగింది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని భారత్ లో విలీనం చేసేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ మద్దతున్న దళాలు కాశ్మీర్ లోకి చొరబడిన క్రమంలో యుద్ధం మొదలైంది. పాక్ మద్దతు దళాలను భారత్ సైన్యం తరిమికొట్టినప్పటికీ... అప్పటికే మూడో వంతు కాశ్మీర్ ను పాకిస్తాన్ ఆక్రమించేసింది. దీన్నే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ( POK ) గా పిలుస్తున్నాం. అయితే.. ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఇరు దేశాలు కాల్పులు విరమించుకున్నాయి. అప్పటి నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ ( LOC ) ఏర్పాటయింది. ఈ యుద్ధంలో భారత్ వ్యూహాత్మక విజయం సాదించినప్పటికీ కాశ్మీర్ వివాదం ఇంకా కొనసాగుతోంది.

1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధం:

ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి యుద్ధం అసంపూర్ణంగా ముగియడంతో కాశ్మీర్ లో అల్లకల్లోలం కంటిన్యూ అయ్యింది. దీంతో 1965 లో కాశ్మీర్ కోసం ఇండియా పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 17 రోజుల పాటు జరిగింది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఇది రెండో యుద్ధం.కాశ్మీర్ లో తిరుగుబాటు ప్రారంభించేందుకు ఆపరేషన్ జిబ్రాల్ట్ పేరిట యుద్ధం ప్రారంభించింది పాకిస్తాన్. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాలకు భారీగా నష్టం వాటిల్లింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది భారత్. ఎట్టకేలకు సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన తాష్కెంట్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ స్వాధీనంలోని భూభాగాలను తిరిగి ఇచ్చేశాయి. అయితే.. ఈ యుద్ధంలో భారత్ పైచేయి సాధించింది.

1971 భారత్ పాక్ యుద్ధం ( బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధం ):

1971లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మూడో యుద్ధం జరిగింది.. బంగ్లాదేశ్ కు స్వాతంత్య్రం రావడానికి కారణం ఈ యుద్ధమే. 13రోజుల పాటు జరిగిన ఈ యుద్దాన్ని బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధంగా పిలుస్తారు. 1947లో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బాంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ గా ఉండేది.. ఈ ప్రాంతంపై ఇప్పటి పాకిస్తాన్ ( అప్పటి పశ్చిమ పాకిస్తాన్ ) కు అధికారం ఉండేది. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోరుతూ పోరాటం చేయటంతో పాక్ సైన్యం బాంగ్లాదేశ్ లో చొరబడి మారణహోమం సృష్టించింది. భారత్ బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలిచి తక్కువ సమయంలోనే తూర్పు పాకిస్తాన్ ను స్వాధీనం చేసుకుంది.

Also Read : ట్రెండింగ్లోకి వ్యోమికా సింగ్.. మీడియా ముందుకు ఈమెనే ఎందుకంటే..

ఈ యుద్ధంలో 93వేల మంది పాక్ సైనికులు లొంగిపోయారు. ఈ యుద్ధంలో భారత్ అఖండ విజయం సాధించి తిరుగులేని పైచేయి సాధించింది. బంగ్లాదేశ్ కు స్వాతంత్య్రం రావడానికి కారణం ఈ యుద్దమే. అయితే.. ప్రస్తుతం భారత్ మీదకే బంగ్లాదేశ్ కాలు దువ్వుతుండటం గమనార్హం.

1999  కార్గిల్ యుద్ధం:

1999లో ఇండియా పాకిస్తాన్ మధ్య నాలుగో యుద్ధం మొదలైంది 83 రోజుల పాటు జరిగిన ఈ యుద్దాన్ని కార్గిల్ యుద్ధంగా పిలుస్తారు. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు భారత్ రంగంలోకి దిగిన ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. భారత సైన్యం ఈ యుద్ధంలో తీవ్రంగా శ్రమించి చొరబాటుదారులను తరిమికొట్టింది. పాక్ స్వాధీనంలో ఉన్న ప్రాంతాలను ఈ యుద్ధం ద్వారా తిరిగి చేజిక్కించుకుంది భారత్. 

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఈ నాలుగు యుద్దాలే కాకుండా.. 2001 - 02లో భారత పార్లమెంట్ దాడి, 2019లో బాల్కోట్ ఎయిర్ స్ట్రోక్, 2020 - 21లో సరిహద్దు ఘర్షణలు వంటి ఘటనలు యుద్ధవాతావరణాన్ని నెలకొల్పాయి.