కాలేజీ జాగ మార్కెట్​కు ఎట్లిస్తరు?.. ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

కాలేజీ జాగ మార్కెట్​కు ఎట్లిస్తరు?.. ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ అమలును  నిలిపివేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా దేవరకొండలోని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీకి చెందిన ఒక ఎకరా 34 గుంటల జాగను ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కోసం మున్సిపాలిటీకి అప్పగించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన  ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ అమలును హైకోర్టు నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఆ స్థలాన్ని ఇవ్వకూడదని అధికారులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌ విద్యా కమిషనర్, జిల్లా కలెక్టర్, దేవరకొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్, ఆర్డీవో, తహసీల్దార్, కాలేజీ ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌కు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌. తుకారాంజీతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పోయినేడాదే ఉత్తర్వులిచ్చిన కలెక్టర్

కాలేజీకి చెందిన 1.34 ఎకరాలను మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు అప్పగించాలని 2022 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ప్రోసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ను సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ దేవరకొండకు చెందిన టి రవికుమార్‌‌‌‌‌‌‌‌ పిల్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ టి. రజనీకాంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి వాదిస్తూ, ఒక డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నుంచి మరో డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ల్యాండ్‌‌‌‌‌‌‌‌ అప్పగించాలంటే ఆయా శాఖల అనుమతి ఉండాలన్న నిబంధనను కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అమలు చేయలేదన్నారు. గతంలో ఇదే మాదిరిగా లైబ్రరీ కోసం కాలేజీకి చెందిన 700 గజాల స్థలాన్ని తీసుకున్నారని, అయితే.. లైబ్రరీ వల్ల స్టూడెంట్లకు, ప్రజలకు ఉపయోగమని అభ్యంతరం చెప్పలేదన్నారు. ఇప్పుడు మార్కెట్‌‌‌‌‌‌‌‌ కోసం కాలేజీ భూమిని తీసుకునే ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. వాదనల తర్వాత స్థలాన్ని మార్కెట్‌‌‌‌‌‌‌‌కు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
జారీ చేసింది.