నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధం

నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధం

ఉత్తర్ప్రదేశ్లోని నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. మొత్తం 40 అంతస్తులతో కూడిన రెండు భారీ భవన సముదాయాలను ఆగస్టు 28న..3,700 కేజీల పేలుడు పదార్థాలతో కూల్చివేయనున్నారు. ఈ ట్విన్ టవర్స్ లో ఒకదాని పేరు ‘సియాన్’. ఇందులో 29 అంతస్తులు ఉన్నాయి. మరో టవర్ పేరు ‘అపెక్స్’. అందులో 32 అంతస్తులు ఉన్నాయి. కేవలం 9 సెకన్ల వ్యవధిలో ఈ ట్విన్ టవర్స్ మొత్తం నేలమట్టం కానున్నాయి. 

ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత కాంట్రాక్టును ఎడిఫైస్ ఇంజినీరింగ్ అనే కంపెనీకి అప్పగించారు. ఆగస్టు 13 నుంచి ఈ టవర్లలో పేలుడు పదార్థాలను అమర్చే ప్రక్రియ మొదలైంది. బ్లాస్టర్లు, ట్రెయిన్డ్ వర్కర్లు మొత్తం 40 మంది కలిసి నోయిడా ట్విన్ టవర్స్ లో పేలుడు పదార్థాలను అమర్చే ప్రక్రియను ఆగస్టు 13నే ప్రారంభించారు. ఆ పనులు సోమవారం సాయంత్రం పూర్తయ్యాయి. అన్ని అంతస్తుల్లోనూ దాదాపు 20వేల  పేలుడు పదార్థాలను అమర్చారు. ఆగస్టు 26లోగా వాటన్నింటిని కనెక్ట్ చేసి సిద్ధంగా ఉంచుతారు. ఆగస్టు 28న మధ్యాహ్నం ఆ పేలుడు పదార్థాల కనెక్షన్లను రీ చెక్ చేస్తారు. 2.30 గంటలకు.. 20వేల పేలుడు పదార్థాల మెయిన్ కనెక్షన్ ను ఒక డిటోనేటర్ కు అనుసంధానించి రిమోట్ ద్వారా పేల్చేస్తారు. 9 సెకన్ల వ్యవధిలో.. రెప్పపాటు టైంలో ట్విన్ టవర్స్ నేలమట్టం అవుతాయి. 

ఈనేపథ్యంలో ట్విన్ టవర్స్ కు అత్యంత సమీపంలో ఉన్న రెండు పెద్ద భవన సముదాయాల్లో నివసించే వారిని.. ఆగస్టు 28న ఉదయం 7 నుంచి తాత్కాలికంగా ఖాళీ చేయించనున్నారు. దీనిపై వారందరికీ ఇప్పటికే సమాచారాన్ని అందించారు. చుట్టుపక్క భవనాల కోసం ఎడిఫైస్ కంపెనీ ఇప్పటికే రూ.100 కోట్ల బీమా కవరేజీని కూడా తీసుకుంది. కాగా, ఈ ట్విన్ టవర్స్ ను నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ లిమిటెడ్ అనే కంపెనీ నిర్మించింది. ఈ భవన సముదాయాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ పలువురు స్థానికులు 2009 సంవత్సరంలో కోర్టును ఆశ్రయంచారు. ఎన్నో ఏళ్లపాటు ఈ విచారణ కొనసాగగా.. స్థానికుల ఆరోపణలు నిజమేనని కోర్టు నిర్ధారించింది. ఆ ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని ఆదేశించింది. ఈ కూల్చివేతతో 25వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయి. వాటిని తొలగించేందుకే మూడు నెలల సమయం పడుతుందని అంటున్నారు.