బడుల్లో జీతాలు తీస్కుంటూ.. ఇక్కడెట్ల పని చేస్తరు?

బడుల్లో జీతాలు తీస్కుంటూ.. ఇక్కడెట్ల పని చేస్తరు?
  •     ఎస్​సీఈఆర్‌‌‌‌‌‌‌‌టీ సిబ్బంది స్కూళ్లు తనిఖీ చేయడమేంటీ?
  •     రివ్యూలో ఆఫీసర్లపై విద్యాశాఖ సెక్రటరీ ఆగ్రహం 

హైదరాబాద్, వెలుగు :  ఏండ్లుగా బడుల్లో జీతాలు తీసుకుంటూ ఎస్​సీఈఆర్ టీలో ఎలా పనిచేస్తారని విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం అధికారులను ప్రశ్నించారు. ఎస్​సీఈఆర్ టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్) ఉన్నది కొందరు ఆఫీసర్ల అవసరాల కోసం కాదన్నారు. కరికులమ్ డెవలప్ చేయాల్సిన ఎస్​సీఈఆర్ టీ స్టాఫ్ స్కూళ్లను తనిఖీలు చేయడం ఏంటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. 

గురువారం ఎస్​సీఈఆర్ టీ ఆఫీసులో బుర్రా వెంకటేశం సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్​సీఈఆర్ టీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్​సీఈఆర్ టీలో టీచర్లు నిర్ణీత టైమ్ కంటే ఎక్కువ కాలం ఉండొద్దని చెప్పారు. కొందరు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలతో ఇతరులకు ఇబ్బందులు వస్తున్నాయని, ఇకపై సమష్టి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. 

సంస్థలో పనిచేసేవారి కోసం ప్రోగ్రామ్స్ నిర్వహించొద్దని.. టీచర్లు, స్టూడెంట్లకు ఉపయోగపడేలాగే అవి ఉండాలని ఆదేశించారు. టీచర్ల గౌరవాన్ని పెంచేలా ఎస్​సీఈఆర్ టీ పనిచేయాలన్నారు. రివ్యూలో ఎస్​సీఈఆర్ టీ డైరెక్టర్ రాధారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎస్​సీఈఆర్ టీ పరిసరాలతో పాటు టీఎస్ఈడబ్ల్యూఐడీసీ, ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టరేట్, హైదరాబాద్ ఆర్జేడీ ఆఫీసు, గ్రంథాయల సంస్థ, తదితర ఆఫీసులను వెంకటేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆఫీసులు నీట్ గా పెట్టుకోవాలని, ఫైల్స్ జాగ్రత్తగా భద్రపర్చాలని ఆదేశించారు.