పాన్ కార్డు మీ ఆర్థిక జీవితానికి గుండెకాయ లాంటిది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా, లేదా ఏదైనా లోన్ పొందాలన్నా పాన్ తప్పనిసరి. అయితే ఇదే మీ బలహీనతగా మారవచ్చు. ఎందుకంటే మీ పాన్ వివరాలను ఉపయోగించి కేటుగాళ్లు మీ ప్రమేయం లేకుండానే లోన్లు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు పొందడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. రికవరీ ఏజెంట్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం లేదా సిబిల్ స్కోర్ పడిపోవడం వంటివి జరిగే వరకు చాలా మంది ఇలాంటి మోసాన్ని గుర్తించలేకపోతున్నారు.
మీ పేరు మీద లోన్ ఉందో లేదో ఎలా చెక్ చేయాలి?
మీ పాన్ దుర్వినియోగం అయిందని గుర్తించడానికి అత్యంత సులభమైన మార్గం 'క్రెడిట్ రిపోర్ట్'ను రెగ్యులర్ గా చెక్ చేసుకోవటం. సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పాన్ కార్డుకు అనుసంధానమైన ప్రతి లోన్, క్రెడిట్ కార్డు రికార్డును కలిగి ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి ఈ సంస్థలు ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్‌ను అందిస్తాయి. వాటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పాన్ వివరాలు సమర్పించి రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా పేటీఎం, బ్యాంక్‌బజార్ వంటి ఫిన్‌టెక్ యాప్‌లలో కూడా మీ క్రెడిట్ స్కోర్‌తో పాటు లోన్ వివరాలను ఉచితంగా చెక్ చేసుకోవచ్చు.
రిపోర్టులో ఏ విషయాలను గమనించాలి?
క్రెడిట్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత.. అందులో ఉన్న ప్రతి లోన్ అకౌంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు ఎప్పుడూ దరఖాస్తు చేయని బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీల పేర్లు అందులో ఉన్నాయా? మీరు అసలు వెళ్లని నగరాల నుంచి లోన్ యాక్టివిటీ కనిపిస్తోందా? మీ క్రెడిట్ స్కోర్ అనూహ్యంగా తగ్గిపోయిందా? అనేవి రిపోర్టులో వెతకాలి. ఇలాంటివి కనిపిస్తే మీ పాన్ దుర్వినియోగం అయినట్లు అనుమానించాలి. ముఖ్యంగా గుర్తు తెలియని చిన్న మొత్తాల్లో డిజిటల్ లోన్లు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని గుర్తుంచుకోండి.
ALSO READ : చతికిలబడ్డ క్రిప్టో కింగ్ బిట్‌కాయిన్..
పాన్ మోసాల నుంచి రక్షణ ఎలా?
ముందు జాగ్రత్తగా మీ పాన్ కార్డు కాపీని ఎవరితోనైనా పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. అన్ సెక్యూర్డ్ వెబ్‌సైట్‌లలో లేదా అనధికారిక ఏజెంట్లకు మీ పాన్ వివరాలు ఇవ్వకండి. కనీసం 6 నెలలకు ఒకసారి క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. బ్యాంక్ అకౌంట్లకు ఎల్లప్పుడూ ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్స్ ఆన్‌లో ఉంచుకోండి. ఒకవేళ మీ అనుమతి లేకుండా లోన్ తీసుకున్నట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత బ్యాంక్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు సైబర్ క్రైమ్ విభాగంలో రిపోర్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.
