మానవ సమాజంలో పెంపుడు జంతువుల పాత్ర అనేక రూపాలలో చర్చలకు, సంఘర్షణకు, సమాజ విభజనలో ప్రస్ఫుటంగా ఈ మధ్య కనపడుతున్నది. కొన్ని పెంపుడు జంతువులు కనుమరుగు అవుతున్నాయి. పెంపుడు జంతువులలో కూడా కొన్ని ప్రముఖ స్థానంలో ఉన్నాయి. అందులో కుక్కలకు ఒక ముఖ్యమైన భూమిక ఉన్నది. పదివేల సంవత్సరాల పై నుంచి కూడా కుక్కలు మానవ సమాజాలలో భాగస్వాములుగా ఉన్నాయి. మొదట అడవి జంతువుల వేటలో భాగస్వాములుగా, రక్షకులుగా, ఆ తరువాత పశువుల కాపరులకు సహాయంగా, మానవ సహాయకులుగా వివిధ పాత్రలు శునకాలు పోషిస్తున్నాయి. వికలాంగులకు కూడా అవి ఉపయోగపడుతున్నాయి. పోలీసులకు కూడా వివిధ చట్టాలను అమలు చేయడానికి ఇవి సహాయం చేస్తున్నాయి. తప్పిపోయినవారిని వెతకడంలో, దొంగలను, హంతకులను పట్టుకోవడంలో పోలీసులకు సహాయం చేస్తున్నాయి. ఈ మధ్య ప్రమాదకరంగా మారిన మాదక ద్రవ్యాల రవాణాను పసిగట్టడంలో కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. శిక్షణ పొందిన శునకాల పాత్ర చాలా కీలకంగా మారింది. ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు కూడా చాలా సేవలు అందిస్తున్నాయి.
మానవ సమాజంలో ఇంతగా పెనవేసుకుపోయిన శునకాల పాత్ర ఈ మధ్య మారిపోయింది. కుక్కలకు ఉండే విశ్వాసం మీద పూర్తి నమ్మకం ఉన్న ప్రజలకు ఈ మధ్య అది సన్నగిల్లుతున్నది. వాటికి మన మీద విశ్వాసం తగ్గిందా? మనకు వాటి మీద నమ్మకం పోయిందా? ఇటీవలి జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుక్క కాటు సంఘటనలు ఎక్కువ అయ్యాయి. కరవడమే కాకుండా చంపేస్తున్న సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల మీద శునకాల దాడులు దేశమంతటా ఎక్కువ అవడం ఆందోళన స్థాయిని పెంచింది. ప్రభుత్వం నుంచి ఈ సమస్యకు పరిష్కారం ఆశిస్తున్న ప్రజల సంఖ్య కూడా పెరిగింది. కొన్ని ప్రాంతాలలో ఇది రాజకీయ అంశంగా మారింది. ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర ప్రభుత్వ పాలకులు దీని గురించి తగిన రీతిలో స్పందించకున్నా.. తెలంగాణలో ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఇది ఒక అంశంగా మారింది. చట్టం అమలు గురించి సుప్రీంకోర్టు వరకు ఇది చేరింది.
రేబిస్ వ్యాధి
కుక్కలు కరిస్తే రేబిస్ వ్యాధి వస్తున్నది. ఇదివరకు రేబీస్ సోకిన కుక్క కరిస్తేనే వ్యాధి వచ్చేది. ఇప్పుడు ఏ కుక్క కరిచినా రేబిస్ వ్యాధి రావచ్చు అంటున్నారు. ఈ మార్పు ఎందువల్ల? శునకాలలో అనేక జాతులు ఉన్నాయి. కొన్ని జాతులు మనుషులు పెంచుతున్నా అవి ఎప్పుడైనా ప్రమాదకారిగా మారవచ్చు అని తెలుసు. అనేక సంఘటనలలో ఈ జాతి కుక్కలు తమ యజమానులను చంపిన సందర్భాలు ఉన్నాయి. వీటిపట్ల అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే, యజమానులు నిర్లక్ష్యం వహించిన సందర్భాలలో ఇవి ఇతరులను గాయపరిచిన లేదా చంపిన సంఘటనలు ఉన్నాయి. వీధులలో శునకాలలో సంఖ్య పెరు గుతున్నది వాస్తవం. పెంపుడు జంతువు అయిన కుక్క వీధులలో తిరగడం అంటే మూడవ వాతావరణం కల్పించినట్లయింది. అడవిలో, ఇండ్లలో, వీధులలో ఉన్న కుక్కలకు సంబంధించి వివిధ రకాల నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయా? అటవీ జంతువుల సంరక్షణకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఇండ్లలో, వీధులలో ఉన్న కుక్కలకు సంబంధించిన చట్టం సంపూర్ణంగా లేదు. కుక్క ఒక జంతువు. దానిపట్ల బాధ్యత ఆయా వ్యక్తుల మీద, సామాజిక వర్గం మీద ఉంటుంది. వాటి వల్ల ఏర్పడుతున్న సమస్యలకు మనమే బాధ్యులం.
పీఈపీ వ్యాక్సిన్
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సుమారు 70% కుక్కలకు టీకాలు వేస్తే రేబిస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అంటారు. రేబిస్ వ్యాధి దాదాపు 100% ప్రాణాంతకం కాబట్టి అన్ని కుక్కలకు టీకాలు వేయలేని పరిస్థితులలో మానవ టీకా (కాటు తర్వాత పీఈపీ) ఒక అదనపు జాగ్రత్త అంటున్నారు. కుక్కలకు టీకాలు వేయడం వల్ల రేబిస్ వ్యాధికి మూలం తగ్గుతుంది. ఒకవేళ వ్యాధి మూలాన్ని పూర్తిగా నియంత్రించలేకపోతే, మనుషులకు టీకాలు వేయడం వలన బాధితులకు రక్షణ లభిస్తుంది అని వాదన. పీఈపీ వ్యాక్సిన్ అనేది రేబిస్ బారిన పడిన తర్వాత మనుషులకు ఇచ్చే అత్యవసర చికిత్స. ఇది అన్ని సమయాలలో పని చేయదు. కుక్కలలో రేబిస్ వ్యాక్సిన్ల వలన కలిగే ప్రతికూల ప్రభావాల మీద పశువైద్య అధ్యయనాలు ఉన్నాయి. చాలావరకు దుష్ప్రభావాలు సాధారణంగా తేలికపాటివి అని అధ్యయనాలు ద్రువీకరించాయి. పశువైద్య టీకాలలో థైమెరోసల్ (పాదరసం పదార్థం) ఉంటుంది. వేరే దేశాలలో ఇవి లేని వ్యాక్సిన్లు ఉన్నాయి. భారతదేశంలో రేబిస్ వ్యాక్సిన్లలో థైమెరోసల్ ఇప్పటికి ఉంటున్నది. తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సురక్షితమైన దీర్ఘకాలిక ఉపయోగం కోసం థైమెరోసాల్ రహిత రేబిస్ టీకాల వైపు ప్రపంచవ్యాప్త ధోరణి ఉంది. భారతదేశం వెలుపల జరిగిన అధ్యయనాలు కుక్కలలో థైమెరోసల్ కలిగిన రేబిస్ వ్యాక్సిన్ల వలన కలిగే ప్రతికూల ప్రభావాలను నమోదు చేశాయి. భారతదేశంలో కుక్కలకు ఇచ్చే రేబిస్ వ్యాక్సిన్లలో థైమెరోసల్పై ప్రత్యేకంగా చేసిన పరిశోధనలు దాదాపు శూన్యం.
శునకాల నియంత్రణ పాలకుల బాధ్యత
రేబిస్ మరణాలను బహిరంగంగా ఆడిట్ చేయడం లేదా పోస్ట్‌మార్టంలతో దర్యాప్తు ఎందుకు చేయడం లేదు? జాతీయ రేబిస్ వ్యూహ చర్చలలో పెంపుడు జంతువులలో వ్యాక్సిన్ వైఫల్య నివేదికలను ఎందుకు పరిగణించడం లేదు? మన దేశంలో వ్యాక్సిన్ల దుష్ప్రభావాల గురించిన సమాచార సేకరణ ఎందుకు జరగడం లేదు? ఏఈఎఫ్ఐ ( ఇమ్యునైజేషన్ తర్వాత అడ్వర్స్ ఈవెంట్) మీద అధ్యయనాలు, నివేదికలు ఎందుకు చేయడం లేదు? భారతదేశంలో రేబిస్ నియంత్రణకు కుక్కలకు టీకాలు అవసరం కాబట్టి వేయాలి. టీకాలు ఇచ్చినంత మాత్రాన అది కుక్కల దాడులను నిరోధించదు అని వ్యాక్సిన్ల రంగం ఘోషిస్తున్నది. వాళ్ల వాదన ప్రకారం దాడులకు కారణం.. కుక్కల అధిక సంఖ్య, పేలవమైన స్టెరిలైజేషన్, మానవ-జంతు సంఘర్షణ. టీకా మాత్రం కాదు. అయితే కుక్కలు ప్రదర్శిస్తున్న దూకుడు, నిర్వహిస్తున్న దాడులను ఎదుర్కోవడానికి వాటి సంఖ్య తగ్గించడం, మెరుగైన పట్టణ నిర్వహణ అని వారి వాదన. జంతు ప్రేమికులు మాత్రం వాటి పట్ల మానవుల వ్యవహారం మారాలి అంటున్నారు. సుప్రీంకోర్టు అన్నీ వీధి కుక్కలను బోనులో వేసి మేపమంటున్నది. పాలకులు అది ఖర్చుతో కూడినది అంటున్నారు. బాధితులు మాత్రం కుక్కలను పూర్తిగా నిర్మూలించమంటున్నారు. సమాచారం లేని, అధ్యయనాలు లేని, జ్ఞానంలేని స్పందన కంటే, సమాచారం అందించే అధ్యయనాలు చేసి దీర్ఘకాలిక పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉన్నది. శునకాల నియంత్రణ బాధ్యత పాలకుల మీదపెట్టె చట్టం కావాలి. శునకాల దాడులకు పాలకులను బాధ్యులను చెయ్యాలి. మనుషులు, కుక్కల మధ్య పరస్పర నమ్మకం సన్నగిల్లినా నష్టపోయేది మనుషులే. కుక్కలను పోలిన రోబోలు వచ్చినా సజీవ శునకాల పాత్ర మన సమాజంలో, జీవనంలో అవసరం అని గుర్తించాల్సిన సమయం కూడా వచ్చింది.
కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి
వీధి కుక్కల సంఖ్య నియంత్రణలో లేకపోవడంపై మున్సిపల్ లేదా పంచాయతీ సంస్థల బాధ్యత ఉంటుంది. వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేయించే బాధ్యత కూడా స్థానిక సంస్థల మీద ఉంది. కానీ, ఆ బాధ్యత నెరవేర్చడం లేదు. ప్రభుత్వాలు నిధులూ ఇవ్వడం లేదు. దోమల సంఖ్య పెరిగి దోమల వల్ల వ్యాధులు పెరిగితే వాటిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న పౌర సంస్థలు వీధి కుక్కల విషయంలో అదేస్థాయిలో స్పందించడం లేదు. సంఖ్య పెరిగింది, సమస్య పెరిగింది కాబట్టి చంపడమే పరిష్కారం అంటున్నారు. కుక్కలను పూర్తిగా నిర్మూలిస్తే దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నది. ఇతర వన్య ప్రాణులు వీధుల్లోకి, ఇండ్లలోకి వస్తే మనలని అప్రమత్తం చేసే ఒక ముఖ్య ఆయుధాన్ని కోల్పోతాం. పాములను, చిరుతలను మనం చూడకముందే పసికట్టగలిగే కుక్కలు పూర్తిగా పోతే మనుష్యులకే సమస్య. ప్రపంచవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వాటి సంఖ్య విచ్చలవిడిగా పెరుగుతున్నందున, కుక్కల పెంపకం కూడా పెరుగుతున్నందున ఈ సంఘటనలు కూడా పెరుగుతున్నాయి అంటున్నారు. అమెరికాలో ఏటా 4.5 మిలియన్లకు పైగా కుక్క కాటులు నమోదవుతున్నాయి. పిల్లలు, ఇంటికి వస్తువులు చేరవేసే డెలివరీ కార్మికులు ఎక్కువగా ప్రమాదంలో ఉంటున్నారు. ఆస్ట్రేలియాలో ఆరు నెలల వ్యవధిలోనే పోస్టల్ ఉద్యోగుల మీద 1,277 దాడుల జరిగాయి.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
