స్ట్రిమ్ ఎంగేజ్ : భయమెందుకు?

స్ట్రిమ్ ఎంగేజ్ :  భయమెందుకు?

జానకి (నవ్య నాయర్)ది మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీ. చిన్నప్పుడే తండ్రి చనిపోతాడు. దాంతో కుటుంబాన్ని పోషించేందుకు జానకి ప్రింటింగ్ ప్రెస్​లో పనిచేస్తుంటుంది. అదే టైంలో కాంట్రాక్టర్​ ఉన్ని ముకుందన్ ( సైజూ కురుప్) ఆమెను చూసి ప్రేమిస్తాడు. జానకి తల్లితోపాటు తన పేరెంట్స్​ని కూడా ఒప్పించి.. పెండ్లి చేసుకుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. అసలు సమస్య ఏంటంటే.. జానకికి భయం ఎక్కువ. గట్టిగా మాట్లాడినా, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలన్నా, చీకటన్నా.. ఇలా ప్రతీ విషయానికి భయపడుతుంటుంది. ఈ విషయం ఉన్ని ముకుందన్​కు ముందే చెప్తుంది. కానీ.. అప్పుడతనికి అది పెద్ద సమస్యగా అనిపించదు. అయితే.. పెండ్లి చేసుకున్న తర్వాత అదే పెద్ద సమస్యగా మారుతుంది. ఇద్దరూ ఒక ఫంక్షన్​కి వెళ్లినప్పుడు అక్కడ ట్రాన్స్​ఫార్మర్​ పేలిపోతుంది. దాంతో జానకి పక్కనే ఉన్న ఒక వ్యక్తిని భయంతో గట్టిగా పట్టుకుంటుంది. ఇంతకీ అతనెవరు? ఆమె పట్టుకోవడం వల్ల అతనికి ఎలాంటి నష్టం కలిగింది? రాజకీయాలకు, జానకి భయానికి సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. పల్లెటూరి వాతావరణం బాగా చూపించారు. కథ కొత్తగా ఉంది. నవ్య నాయర్, సైజూ కురుప్​ ​ యాక్టింగ్​ బాగుంది.

టైటిల్​ : జానకీ జానే
డైరెక్షన్​ : అనీష్ ఉపాసన
కాస్ట్ : సైజూ కురుప్​, నవ్య నాయర్​, ధ్యాన్​ శ్రీనివాసన్​, షరఫుద్దీన్​, అనార్కలి మరికర్​,  కొట్టాయం నజీర్​, జానీ ఆంటోనీ​
లాంగ్వేజ్ : మలయాళం 
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​

సక్సెస్​​ స్టోరీ

ఫేమస్​ చెఫ్​ తార్లా దలాల్ లైఫ్​ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఒక మామూలు గృహిణి నుండి ఇండియాలోనే ఫేమస్​ చెఫ్‌‌‌‌‌‌‌‌లలో ఒకరిగా ఎదిగిన ఆమె ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించారు.  అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న తార్లాషా (హుమా ఖురేషి) లైఫ్​లో ఏదైనా సాధించాలి అని ఆరాటపడుతుంది. కానీ.. ఏం చేయాలో తెలియదు. తనలో ఎలాంటి టాలెంట్​ ఉందో తెలుసుకునేలోపే ముంబైకి చెందిన క్వాలిటీ మేనేజర్ నలిన్ దలాల్ (షరీబ్ హష్మీ)ని పెండ్లి చేసుకుంటుంది.70ల్లో చాలామంది మహిళలు కాలేజీ పూర్తి కాకముందే పెండ్లి చేసుకునేవాళ్లు.   తర్వాత వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, పిల్లలను పెంచడంతోనే సరిపోయేది. కానీ.. అందరికీ భిన్నంగా తార్లా మాత్రం పెండ్లి తర్వాతే తనేంటో తెలుసుకుంది. శాకాహార వంటకాలకు కేరాఫ్​గా మారింది. ఇంటికి దూరంగా ఒంటరిగా ఉన్నవాళ్లకు మంచి భోజనం దొరికేలా చేసింది. ఎంతోమంది ఆడవాళ్లకు అత్తమామలు, భర్తను ఆకట్టుకోవడంలో సాయపడింది.  హుమా ఖురేషి యాక్టింగ్​ చాలాబాగుంది. అందరికీ తెలిసిన కథే అయినా.. తెరకెక్కించడంలో కొత్తదనం చూపించారు డైరెక్టర్​ పియూష్​ గుప్త. స్క్రీన్​ప్లే కూడా బాగుంది. 

టైటిల్​ : తార్లా 
డైరెక్షన్​ : పియూష్​ గుప్త
కాస్ట్ : హుమా ఖురేషి, షరీబ్​ హష్మి, వీన నాయర్​, భర్తీ అచ్రేకర్​, పునీందు భట్టాచార్య
లాంగ్వేజ్ : హిందీ 
ప్లాట్​ ఫాం :  జీ5

మత్స్యకారుల జీవితం

టైటిల్​ : రుద్రమాంబపురం
డైరెక్షన్​ : మహేష్ బంటు
కాస్ట్ : అజయ్ ఘోష్, శుభోదయం సుబ్బారావు, అర్జున్ రెడ్డి, ప్రమీల, నండూరి రాము, జనార్దన్, జెమినీ కిరణ్, వంశీధర్ చాగర్లమూడి
లాంగ్వేజ్ : తెలుగు
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్ హాట్​స్టార్ 

చేపలు పట్టుకుని బతికే శివయ్య (శుభోదయం సుబ్బారావు), చేపల వ్యాపారం చేసే తిరుపతి(అజయ్ ఘోష్)ల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. తిరుపతి కొడుకు శీనయ్య(అర్జున్)కి మాత్రం వీళ్లు గొడవపడటం ఇష్టం ఉండదు. దాంతో ఇద్దరికీ సర్దిచెప్దామనే ఉద్దేశంతో లోకల్​ ఎమ్మెల్యే సాయం తీసుకుంటాడు. గొడవలకు ఫుల్​స్టాప్​ పెట్టించాలి అనుకుంటాడు. ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలని ప్రయత్నిస్తాడు. అంతేకాదు.. తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓషనాలజీలో పీహెచ్​డీ కూడా చేస్తాడు. కానీ.. తీరా చూస్తే.. సముద్రాన్ని నాశనం చేసేది తన తండ్రే అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తిరుపతి మారాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అజయ్ ఘోష్ యాక్టింగ్​ బాగుంది. ఈ సినిమాకు కథ కూడా ఆయనే రాశాడు. ఇందులో ముఖ్యంగా మత్స్యకారుల లైఫ్​, వాళ్ల కష్టాలను బాగా చూపించారు. నటీనటులు అందరూ పర్వాలేదనిపించారు. కానీ.. కథ పెద్దగా ఆకట్టుకోలేదు. మేకింగ్​ కూడా బాగాలేదు.