తెలంగాణ భవన్‌‌లో నార్త్‌‌ ఇండియా వాళ్లకు జాబులెట్లిస్తరు?

తెలంగాణ భవన్‌‌లో నార్త్‌‌ ఇండియా వాళ్లకు జాబులెట్లిస్తరు?
  • ఢిల్లీ తెలంగాణ భవన్‌‌లో నార్త్‌‌ ఇండియా వాళ్లకు జాబులెట్ల ఇస్తరు?
  • భవన్‌‌లోని అంబేద్కర్‌‌ విగ్రహం ఎదుట స్టూడెంట్ల ధర్నా
  • పోలీసులు ఈడ్చేయడంతో భవన్‌‌ గేటు దగ్గర ఆందోళన

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో తెలంగాణ బిడ్డలకు కాకుండా నార్త్ ఇండియా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారంటూ తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ (టీఎస్ఏ) విద్యార్థి నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. భవన్‌‌లోని అంబేద్కర్‌‌ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న స్టూడెంట్లను మఫ్టీలో ఉన్న తెలంగాణ పోలీసులు భవన్‌‌ గేటు ముందు వరకు ఈడ్చుకెళ్లారు. స్టూడెంట్లు గేటు ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. తెలంగాణ భవన్‌‌ను నార్త్ ఇండియా భవన్‌‌గా మార్చారని టీఎస్ఏ ప్రెసిడెంట్ వివేక్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలోని కేరళ, తమిళనాడు, కర్నాటక భవన్‌‌లలో సొంత రాష్ట్రాల వారికే ప్రాధాన్యం కల్పిస్తారన్నారు. ఏపీ భవన్‌‌లోనూ ఆంధ్ర ప్రజలకే అవకాశం కల్పిస్తే తెలంగాణ భవన్‌‌లో ఈ వివక్ష ఎందుకని నిలదీశారు. భవన్‌‌లో మొత్తం 74 మంది ఔట్ సోర్సింగ్‌‌లో పని చేస్తున్నారని, ఇందులో నలుగురే తెలంగాణ వారని వివరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో ఒక్కో కుటుంబం నుంచి నలుగురికి భవన్‌‌లో ఉద్యోగాలు కల్పించారన్నారు. వాచ్‌‌మెన్, రిసెప్షన్, లైజనింగ్, ప్రోటోకాల్ వంటి ఉద్యోగాల్లోనూ తెలంగాణ వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.  ఈ అంశంపై సీఎం, ఎంపీలు ఫోకస్‌‌ పెట్టాలని కోరారు.  

విద్యార్థులతో ఆర్సీ చర్చలు

భవన్ గేటు ముందు ఆందోళన చేస్తున్న స్టూడెంట్లను భవన్‌‌ రెసిడెంట్‌‌ కమిషనర్‌‌(ఆర్సీ) గౌరవ్ ఉప్పల్ చర్చలకు పిలిచారు. స్టూడెంట్లు ఆర్సీ చాంబర్‌‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో స్టూడెంట్ల వద్దకు ఆయనే వచ్చి మాట్లాడారు. తర్వాత ఆర్సీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్‌‌లో తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కొంత మంది ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్లు కోరారని చెప్పారు. నార్త్ ఇండియా వారికే అవకాశాలు కల్పించారనే విషయం తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. ఏపీ భవన్‌‌లో రిటైరైన ఉద్యోగులను తెలంగాణ భవన్‌‌లో ఔట్ సోర్సింగ్ కింద తీసుకుంటున్నారనే అంశమూ తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్, కొత్త వారికి ఉద్యోగాలు కల్పించడం తన పరిధిలో లేదని.. విద్యార్థి నేతల రిప్రజెంటేషన్‌‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. భవన్‌‌లో నియామకాలపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.