అయోధ్యకు దారిదే.. రైళ్లలో, బస్సుల్లో ఎలా వెళ్లాలంటే....

అయోధ్యకు దారిదే.. రైళ్లలో, బస్సుల్లో ఎలా వెళ్లాలంటే....

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని తరువాత అంటే జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. మరి అయోధ్యకు ఎలా వెళ్లాలి? అక్కడ రోజూ జరిగే పూజలేమిటి? రామాలయం సందర్శనలో ఎటువంటి విధివిధానాలు ఆచరించాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

రైలు మార్గం

దేశంలోని  ఏ ప్రాంతం నుంచి అయినా అయోధ్యకు చేరుకోవచ్చు.  తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు సికింద్రాబాద్ నుంచి రైలులో గోరఖ్ పూర్ వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సు  ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు.ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రా బాద్ నుంచి గోరఖ్ పూర్‌కు వెళ్లే రైలు అందుబాటులో ఉంది. ఈ రైలులో 30 గంటల పాటు ప్రయాణం చేయాలి.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి సోమ, ఆదివారాలలో అందుబాటులో ఉంది. మొత్తంగా  తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారు ప్రతి శుక్ర, ఆది, సోమ వారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది.అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం సికింద్రా బాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. న్యూ ఢిల్లీ నుంచి  రైలు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునేవారు  దాదాపు 10 గంటలపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 

రోడ్డు మార్గం

అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.  ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర రూ. 6 వేలు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్‌రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి.  

విమానయానం

విమానయాన సంస్థలు  కూడా స్పెషల్ ఫ్లైట్స్ ను నడిపేందుకు సిద్ధమయ్యాయి.  విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులు హైదరాబాద్‌ శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంశాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, లేదా గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలులో ప్రయాణించి చేరుకోవచ్చు.