ప్లాస్టిక్‌‌ బాటిల్సే పూలకుండీలు

ప్లాస్టిక్‌‌ బాటిల్సే పూలకుండీలు

మొక్కలను పెంచడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. రకరకాల మొక్కల్ని  పెట్టడం కోసం డిజైన్ పూలకుండీలను కొంటుంటారు. వాటికయ్యే ఖర్చుకూడా ఎక్కువే. మరి ఈ ఖర్చు తగ్గించాలంటే ఇంట్లో ఉండే కూల్‌‌డ్రింక్ పెట్​ బాటిల్స్​, వాటర్‌‌‌‌ బాటిల్స్‌‌నే కుండీల్లా వాడొచ్చు.   అపార్ట్‌‌మెంట్స్‌‌లో ఉండేవాళ్లకు తక్కువ ప్లేస్‌‌ ఉంటుంది. పూలకుండీలు పెట్టడం వల్ల ఉన్న ఆ కాస్త ప్లేస్‌‌ కూడా పోతుంది. అలా కాకుండా ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌‌ చాలా హెల్ప్‌‌ అవుతాయి.  లీటర్‌‌‌‌ లేదా రెండు లీటర్ల ప్లాస్టిక్‌‌ బాటిల్స్‌‌ తీసుకోవాలి. వాటిని తలకిందులుగా చేసి బాటిల్‌‌ అడుగును కత్తిరించాలి. బాటిల్‌‌కు ఉన్న మూతకు చిన్న రంధ్రాలు చేయాలి. తరువాత బాటిల్‌‌లో మట్టి వేసి మొక్కను నాటాలి. బాటిల్‌‌కు చిన్న రంధ్రాలు చేసి తాడుతో ఇంట్లో మీకు నచ్చిన ప్లేస్‌‌లో కుండీని వేలాడ దీయొచ్చు. 

ఎక్కువ బాటిల్స్‌‌ లేకపోతే ఒక్క బాటిల్‌‌లోనే రెండు కుండీలను తయారు చేయొచ్చు. బాటిల్‌‌ను సమానంగా మధ్యలోకి కత్తిరించి కింద చిన్నరంధ్రాలు చేస్తే సరిపోతుంది. రెండింట్లో మట్టి వేసి మొక్కలు నాటొచ్చు. రైలింగ్‌‌ ప్లాంటర్‌‌‌‌ను తయారు చేయాలంటే రెండు 
లీటర్ల బాటిల్‌‌ బాగుంటుంది. సైజ్‌‌ పెద్దగా ఉండి కంఫర్ట్‌‌గా రైలింగ్‌‌ ప్లాంటర్‌‌‌‌ను తయారుచేయొచ్చు. వీటిలో పోర్చులాక, పిటూనియా లాంటి మొక్కలను పెంచొచ్చు. బాటిల్‌‌ మధ్యలో కొంచెం భాగం వదిలి, రెండుముక్కల్లా కత్తిరించాలి. రెండు వైపులా మొక్కలు నాటొచ్చు. దాన్ని వంచి కావాల్సినచోట తగిలించుకోవచ్చు. 

 బాటిల్‌‌ను నిలువుగా ఉంచి బాటిల్‌‌ మధ్యలో అడ్డంగా కొంత కత్తిరించాలి. రెండువైపులా చిన్న రంధ్రాలను చేసి మధ్యలో మట్టిని నింపి మొక్క నాటాలి. రెండువైపులా దారాన్ని కట్టి వేలాడదీయొచ్చు.   బాటిల్స్‌‌కు కలర్స్‌‌తో డిజైన్స్‌‌ వేసి అందంగా చేయొచ్చు. వీటిలో ఎక్కువగా పూలు, వెజిటబుల్‌‌ మొక్కలు... ఇంకా ఏవైనా షోకేస్‌‌ మొక్కలు నాటొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే... వీటితో బాల్కనీని అందంగా తయారుచేయొచ్చు.