పెద్దపల్లి ఎమ్మెల్యే ఖాతాలో ట్రినిటి సొసైటీ భూములు .. 27.19 ఎకరాలు దాసరి మనోహర్​రెడ్డి పేరు మీదనే

పెద్దపల్లి ఎమ్మెల్యే ఖాతాలో ట్రినిటి సొసైటీ భూములు .. 27.19 ఎకరాలు దాసరి మనోహర్​రెడ్డి పేరు మీదనే
  • ధరణి పోర్టల్​లో తప్పుగా ఎంట్రీ అయ్యాయట!
  • ఇన్నేళ్లు సైలెన్స్..ఎన్నికల అఫిడవిట్​లో వెల్లడి 
  • పాలితం, రంగాపూర్ ల్యాండ్స్ వివరాల ప్రస్తావన 

కరీంనగర్, వెలుగు: భూరికార్డుల ప్రక్షాళనలోని లోపాలు, ధరణి డేటా ఎంట్రీలో జరిగిన తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లతో బయటికి తెలుస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ తన పాస్​బుక్ లో గుంట భూమి ఎక్సెస్ ఉన్నట్లు స్వయంగా అఫిడవిట్​లో పేర్కొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కూడా తనవి కాని భూములు తన పేరిట తప్పుగా పాస్ బుక్ లో నమోదయ్యాయని అఫిడవిట్​లో ప్రత్యేకంగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. అలాగే కోర్టు కేసులో ఉన్న కాసుపల్లి, రంగాపూర్ ల్యాండ్స్ కూడా ఆయన అఫిడవిట్​లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

పలు అనుమానాలు

పెద్దపల్లి అర్బన్ పరిధిలోని 280, 282/2, 264, 268, 289, 292, 293, 302 సర్వే నంబర్లలో 20.09 ఎకరాల భూమి, ఇదే మండలం కాసులపల్లి(పాలితం రెవెన్యూ విలేజీ)లోని సర్వే నంబర్ 415, 416 లో 7.10 ఎకరాల భూమి సేల్ డీడ్ ప్రకారం ట్రినిటి సొసైటీ ఫర్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ పేరిట ఉంది. సొసైటీ పేరుతోనే ఈ భూములకు పాస్ బుక్స్ ఇష్యూ కావాల్సి ఉంది. అయితే దాసరి మనోహర్ రెడ్డి పాస్ బుక్ లో ఆ భూములు నమోదయ్యాయి. ధరణి పోర్టల్ లోనూ సొసైటీ పేరు కాకుండా తన పేరునే చూపిస్తోందని అఫిడవిట్ లో మనోహర్ రెడ్డి వెల్లడించారు.

తన ఖాతా నుంచి ఈ భూములను డిలీట్ చేయాలని కోరుతూ తాను ఇప్పటికే కలెక్టర్ కు అప్లికేషన్ కూడా పెట్టుకున్నానని పేర్కొన్నారు. అయితే భూముల డేటా కరెక్షన్ కు సంబంధించి ఏ అప్లికేషన్ అయినా ధరణి పోర్టల్​ద్వారానే పెట్టుకోవాల్సి ఉంటుంది. సమస్య ఉన్న ఆయా సర్వే నంబర్లను సెర్చ్ చేసినప్పుడు అప్లికేషన్ నంబర్ అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ నంబర్ ద్వారా కలెక్టర్ ఆ అప్లికేషన్ ను రిజెక్ట్ చేశారో.. అప్రూవ్ చేశారో తెలుసుకోవచ్చు. కానీ మనోహర్ రెడ్డి పేర్కొన్న ఏ సర్వే నంబర్ లోనూ అప్లికేషన్ నంబర్ రిఫ్లెక్ట్ కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

కాసుపల్లి, రంగాపూర్ ల్యాండ్స్ పై డిక్లరేషన్ 

పెద్దపల్లి మండలం ధర్మాబాద్ రంగనాథస్వామి ఆలయానికి ధర్మాబాద్, కాసుపల్లిలో 462 ఎకరాల ఇనాం భూమి ఉంది. ఈ భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులు పహణీలో పేర్లు నమోదు చేయించుకుని సాగు చేసుకుంటున్నారు. ఇందులోనే ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేరిట 6.13 ఎకరాలు ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఎండోమెంట్ ల్యాండ్స్ గా పేర్కొంటూ 2012లో ఆర్డీఓ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో మిగతా రైతులతోపాటు మనోహర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ALSO READ : అగ్ని ప్రమాదాల నివారణలో.. బల్దియా ఫెయిల్ హైదరాబాద్ లో వరుసగా ఘటనలు

ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. వారికి పాస్ బుక్స్ ఇష్యూ కాలేదు. ఎండోమెంట్ ల్యాండ్ వ్యవహారం ఇటీవల వివాదాస్పదం కావడంతో అఫిడవిట్​లో మనోహర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రంగాపూర్ లో గవర్నమెంట్ ల్యాండ్ గా ఆర్డీఓ ఆర్డర్ పాస్ చేసిన భూమి ధరణిలో తన పేరిట చూపిస్తోందని, పాస్ బుక్స్ మాత్రం ఇష్యూ కాలేదని పేర్కొన్నారు. ఈ భూమిపైనా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు అఫిడవిట్ చివరలో డిక్లరేషన్ లో వెల్లడించారు.