ఇది డిజిటల్ యుగం. ఏ పనైనా చిటికెలో అయిపోతుంది. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ అంత డెవలప్ అయింది. ప్రస్తుతం పండుగలు, పెండ్లిళ్ల సీజన్ కావడంతో అందరి దృష్టి షాపింగ్స్, ఆఫర్ల మీదే ఉంది. ప్రస్తుతం బంగారం ధర లక్షల్లో ఉన్నా పసిడి ప్రియులు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా కొనేస్తున్నారు. అయితే మీరు కొనే ప్రొడక్ట్ కొన్నిసార్లు నకిలీది కావొచ్చు. అలాంటప్పుడు దాన్ని తెలుసుకోవడం ఎలా? దీనికీ టెక్నాలజీని ఉపయోగించొచ్చు.
అందుకోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) వారి ‘బిఐఎస్ కేర్ యాప్’ నుంచి తెలుసుకోవచ్చు. ముందుగా యాప్ ఓపెన్ చేసి బిఐఎస్ హాల్ మార్క్ గుర్తును సెర్చ్ చేయాలి. తర్వాత అసలైన నగలపై ఉన్న బిఐఎస్ ట్రయాంగిల్ లోగో, 22కె లేదా 18కె వంటి క్యారెట్ విలువ, నగల వ్యాపారి ప్రత్యేక కోడ్‌ను తనిఖీ చేయాలి. యాప్ ఓపెన్ చేసి వెరిఫై HUID అంటే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత నగలపై ముద్రించిన 6 అంకెల కోడ్‌ను ఎంటర్ చేయాలి. లేదా స్కాన్ చేయాలి. దాంతో కొన్ని సెకన్లలోనే నగల వివరాలన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. అందులో నగల వ్యాపారి పేరు, హాల్ మార్క్, క్యారెట్ విలువ వంటివన్నీ తెలుస్తాయి. యాప్ డేటా డైరెక్ట్‌గా బిఐఎస్ సర్వర్‌కు లింక్ అయి ఉంటుంది. దాంతో సెక్యూరిటీకి నో ప్రాబ్లమ్.
ప్రమోషన్లకు చెక్!
వాట్సాప్.. ఇది కేవలం మెసేంజర్ మాత్రమే కాదు. ఎంతోమంది రకరకాల పనుల కోసం ఉపయోగపడుతోంది. అందుకే వ్యాపార సంస్థలు, బ్యాంకింగ్ సెక్టార్లు కూడా వాట్సాప్‌ను వాళ్లకు అవసరమైన విధంగా వాడుకుంటున్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రమోషనల్ మెసేజ్‌లు, స్మాల్ వీడియోల రూపంలో వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నాయి. అందులో ఆఫర్లు, సర్వీస్‌లు, డిస్కౌంట్లు వంటి వాటి గురించి ఉంటాయి.
అయితే ఇవి ఎప్పుడైనా ఒకసారి వస్తే పర్వాలేదు. కానీ నెలకు, వారానికి రకరకాల మెసేజ్‌లు వస్తుంటాయి. వాటి వల్ల యూజర్లు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఏదైనా కంపెనీ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి చాట్ రూమ్‌కి వెళ్లి, స్టాప్ అని మెసేజ్ సెండ్ చేయాలి. దాంతో ఆ మెసేజ్‌లు రావడం ఆగిపోతాయి. అయితే, కొన్ని చాట్లు అలా ఆగకపోతే వాటిని బ్లాక్ చేయొచ్చు.
