మన వీధి కుక్కలు ఇటలీ, నెదర్లాండ్స్ వెళ్లాయి..

మన వీధి కుక్కలు ఇటలీ, నెదర్లాండ్స్ వెళ్లాయి..

ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసికి చెందిన రెండు వీధి కుక్కలు నెదర్లాండ్స్, ఇటలీకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వీటిని ఇటలీకి చెందిన వీర లాజారెట్టి, నెదర్లాండ్స్ కు చెందిన మిరెల్ బోంటెన్ బెల్.. మోతీ, జయ అనే కుక్కలను దత్తత తీసుకున్నారు. వీటిని తమ దేశాలకు తీసుకెళ్లడానికి ఇప్పటికే పాస్ పోర్టులు సిద్ధం చేశామని, ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

ఈ కుక్కలను వీరు వారణాసిలోని యానిమల్ కేర్ ట్రస్ట్ నుంచి దత్తత తీసుకున్నారు. మోతీకి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చామని ట్రస్టు చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ ఇంద్రనీల్ బసు తెలిపారు. వాటికి మైక్రో చిప్ చేసి, విమానాశ్రయంలో గుర్తించేలా ఏర్పాటు చేశామని ట్రస్టు సభ్యుడు సందీప్ సేన్ గుప్తా తెలిపారు. అందులో డిజిటల్ నంబర్ కూడా ఉంటుందని, ఈ చిప్ లో 15 అంకెల సంఖ్య ఉంటుందని చెప్పారు.

ఇక జయ అనే కుక్కను నెదర్లాండ్స్ కు చెందిన మిరల్ బోంటెన్ బెల్.. కాశీ వీధుల్లో కనుగొన్నట్టు తెలుస్తోంది. మున్షీ ఘాట్ వద్ద కుక్కలు జయను వెంబడిస్తుండగా మిరల్ దాన్ని కాపాడి, దత్తత తీసుకున్నాడు. ఇక మోతీ, జయల పర్యటన ఆగష్టులో షెడ్యూల్ చేయబడినట్టు తెలుస్తోంది.

బసు, అతని భార్య అనిమోటల్ ఎన్జీవోలో పనిచేస్తున్నారు. కుక్కల సంరక్షణ కోసం గత 3ఏళ్లుగా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం తన భార్య ఓ ఇండీస్ జాతి కుక్క పిల్లను రక్షించిందని, కానీ అప్పట్లో తనకు అది ఇష్టం లేకపోయేదని బసు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో తాము రోజుకు 750 వీధి కుక్కలకు పైగా ఆహారం అందజేశామని, తమ ఇంటి చుట్టు పక్కల ఉండే కుక్కల కోసం షెల్టర్ హోమ్ ను ప్రారంభించామని చెప్పారు. ప్రస్తుతం తమ షెల్టర్ హోమ్ లో 26 కుక్కలు ఉన్నాయని, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కుక్కల కోసం ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్ కూడా ఉందని వివరించారు. కుక్కలను చూసుకోవడానికి తమ వద్ద పశు వైద్యులు కూడా ఉన్నాయని సుదేష్ణ బసు అన్నారు. తాము అన్ని సౌకర్యాలను స్వంత ఖర్చుతో ఉచితంగా అందిస్తున్నామని స్పష్టం చేశారు.