
- రాష్ట్ర సర్కార్‌కు హెచ్‌ఆర్సీ ఆదేశం
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్ వద్ద ఈనెల 18న జరిగిన భారీ అగ్నిప్రమాదం పై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ ప్రమాద ఘటనను సుమోటోగా తీసుకుంది. కేసుపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు.
ప్రమాదం జరిగిన బిల్డింగ్ సేఫ్టీ, విద్యుత్ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణకు సంబంధించి నిబంధనలు పాటించలేదని పలు మీడియాలలో వచ్చిన కథనాలపై చైర్మన్ స్పందించారు. ఈ ఘటనలో 17 మంది మృతికి కారణాలపై జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీ , టీఎస్ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశారు.