ఉస్మానియాలో రోగులకు తిప్పలు..హాస్పిటల్ను సందర్శించిన మానవ హక్కుల వేదిక ప్రతినిధుల బృందం

ఉస్మానియాలో రోగులకు తిప్పలు..హాస్పిటల్ను సందర్శించిన మానవ హక్కుల వేదిక ప్రతినిధుల బృందం
  •     సమస్యలపై ఆరోగ్య మంత్రికి లేఖ 
  •     పనిచేయని సీటీ స్కాన్‌‌‌‌లు.. గాంధీ, ఎంఎన్‌‌‌‌జేకు రిఫర్ 
  •     బెడ్లు లేక పేషెంట్లకు నేల మీదే చికిత్స 
  •     సరిపడా నర్సులు లేక.. అరకొరగా వైద్య సేవలు
  •     నీళ్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల పేద రోగులకు పెద్ద దిక్కుగా ఉన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌‌‌‌లో అరకొర సౌకర్యాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవలు అందక, కనీస సౌకర్యాలు లేక నిరుపేదలు నరకం చూస్తున్నారు. హాస్పిటల్‌‌‌‌లో నెలకొన్న పరిస్థితులపై మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధుల బృందం, హాస్పిటల్‌‌‌‌లో రాజ్యాంగం కల్పించిన ‘ఆరోగ్య హక్కు’ కాలరాస్తున్నారని మండిపడింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఒక బహిరంగ లేఖ రాసింది. పరిపాలనా లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉస్మానియా హాస్పిటల్ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఎండిపోయిన బోరు

ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌లోని బోరు బావి ఎండిపోవడం, మున్సిపల్ నీటి సప్లై పడిపోవడంతో పేషెంట్లు, వారి అటెండెంట్లు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు హాస్పిటల్ ప్రాంగణంలో ప్రైవేట్ వెండర్లు నీటి వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని హక్కుల వేదిక బృందం గమనించింది. ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన నీటిని రోగులు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి రావడం ఏంటని ప్రశ్నించింది. నీటి కొరత వల్ల హాస్పిటల్‌‌‌‌లో పారిశుధ్యం కూడా దెబ్బతిని ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

రోగులకు నేల మీదే చికిత్స 

 ప్రతిరోజూ సుమారు  రెండు వేల మంది ఓపీకి వస్తుండగా, వందల సంఖ్యలో ఎమర్జెన్సీ కేసులు నమోదవుతున్నాయి. కానీ, వారిని చూసేందుకు తగినంత మంది నర్సులు, డాక్టర్లు లేరు. ఇటీవల 60 మంది నర్సులను బదిలీ చేసి కేవలం 30 మందిని మాత్రమే నియమించడం వల్ల విధుల్లో ఉన్నవారిపై అధిక భారం పడుతోంది. బెడ్ల కొరత మరీ దారుణంగా మారింది. కనీస మానవీయత లేకుండా రోగులు కారిడార్లలో, మురికిగా ఉన్న నేల మీద పడుకుని చికిత్స పొందుతున్నారు. ఎమర్జెన్సీ వార్డుల్లో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉందని, రోగుల గౌరవానికి భంగం కలిగేలా వైద్యం అందుతోందని హక్కుల వేదిక బృందం పేర్కొంది.

పనిచేయని మెషిన్లు..

ఉస్మానియాలోని సీటీ స్కాన్ మెషిన్లు చెడిపోయి చాలా కాలం అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ పనిచేయకపోవడంతో రోగులను గాంధీ, ఎంఎన్‌‌‌‌జే హాస్పిటల్‌‌‌‌కు పంపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే అక్కడ కూడా  మెషిన్లు పనిచేయని దుస్థితి నెలకొంది. దీంతో పేద రోగులు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌పై ఆధారపడే వేలాది కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని హక్కుల వేదిక డిమాండ్ చేసింది.సీటీ స్కాన్ మెషిన్ రిపేరు చేయించాలని, ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులను భర్తీ చేయాలని కోరింది. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే మానవ హక్కుల కమిషన్‌‌‌‌ను ఆశ్రయించడంతో పాటు, పౌర సమాజంతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హక్కుల వేదిక ప్రతినిధులు ఎస్. జీవన్ కుమార్, సయ్యద్ బిలాల్, సంజీవ్ హెచ్చరించారు.