హైదరాబాద్ లో రోజు రోజుకు డ్రగ్స్ దందా పెరుగుతుంది. నగరంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. రెండు కేసుల్లో కోటి రూపాయల విలువ చేసే గాంజా, రూ.11 లక్షల డ్రగ్స్, 44కేజీల గాంజా, నాలుగు ఫోర్ వీలర్లు, ఎనిమిది సెల్ ఫోన్లు సీజ్ చేశామని పేర్కొన్నారు.
బెంగళూరురకు చెందిన పాస్టర్ డేవిసన్ ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఆల్ ఇండియా నైజీరియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్న డేవిసన్.. వెల్ఫేర్ అసోసియేషన్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పేర్కొన్నారు. రూ. లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంజా రవాణాను అడ్డుకోవడానికి విస్తృతమైన ఇంటెలిజెన్స్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వంకడోతు వీరన్న గాంజా రవాణాలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. మొదట బ్యాంకు ఉద్యోగిగా, ఆ తరువాత టీచర్ గా పనిచేసి ఆదాయం తక్కువ ఉండటంతో.. వీరన్న గాంజా వ్యాపారంలోకి దిగాడని తెలిపారు. వాంకడోతు వీరన్నపై గతంలో 5 కేసులు ఉన్నాయని వెల్లడించారు. వైజాగ్ నుంచి వరంగల్ వరకు వచ్చి మధ్యలో డ్రైవర్లను మార్చి ప్లాన్డ్ గా వ్యవహరించేవారన్నారు.
మహారాష్ట్ర బీడ్ లో ఉన్న నికిలేష్ తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి గాంజాను ఎక్కువ మొత్తానికి విక్రయించేవాడని తద్వారా వీరన్న గాంజా బిజినెస్ చేసేవాడని తెలిపారు. నిందితుడికి ఒక లావిష్ ఇల్లు, జేసీబీ, ఇన్నోవా కార్లు, సూపర్ మార్ట్, మోహిని వైన్స్ లు ఉన్నాయని ప్రకటించారు. వాటితో పాటు నింధితుడు విలాసవంతమయిన జీవితానికి అలవాటు పడటంతో.. 20 మందిని తన వ్యాపారంలోకి దించారని తెలిపారు.
