 
                                    ఎల్బీనగర్, వెలుగు: యూఎస్‌లో ఉండే కూతురు వద్దకు ఓ కుటుంబం వెళ్లగా, వారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ సాయినగర్ కాలనీ రోడ్డు నంబర్ 1లో భాస్కర్, ప్రమీల దంపతులు నివాసముంటున్నారు. వీరి ఇద్దరు కూతుళ్లు అమెరికాలో స్థిరపడ్డారు.
సెప్టెంబర్ 17న దంపతులిద్దరు అమెరికాలో ఉన్న కూతుళ్ల వద్దకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ప్రమీల తమ్ముడు శ్రీనివాస్ కు కనిపెడుతూ ఉండమని చెప్పి వెళ్లిపోయారు. గురువారం ఉదయం భాస్కర్ ఇంటి ఎదురుగా ఉండే వినోద్.. శ్రీనివాస్ కు ఫోన్ చేసి బుధవారం రాత్రి ఇంట్లో లైట్లు వెలిగి ఉన్నాయని, కిటికి గ్రిల్ తెరిచి ఉందని చెప్పాడు.
వెంటనే శ్రీనివాస్ అక్కడికి వెళ్లగా ఇంట్లో బీరువాలో దాచిన 40 తులాల బంగారు ఆభరణాలు, 2 వెండి ప్లేట్లు, ఇతర వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బెడ్ రూమ్ కిటికి గ్రిల్ పగులగొట్టి ఇంట్లో చొరబడినట్లు గుర్తించారు. నాగోల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేసి ఇంటి గోడ దూకి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 
         
                     
                     
                    