‘ప్రజావాణి’కి పోటెత్తిన దళితబంధు ఫిర్యాదుదారులు

‘ప్రజావాణి’కి పోటెత్తిన దళితబంధు ఫిర్యాదుదారులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో 205 దరఖాస్తులు వచ్చాయి. అడిషనల్​ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ కు చెందిన దళితబంధు ఫిర్యాదులే 102 ఉన్నాయి. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రెవెన్యూ ఫిర్యాదులు 62, మున్సిపల్ కు చెందినవి 7, ఇతర శాఖలకు సంబంధించినవి 34 దరఖాస్తలు ఉన్నాయి. 

హుజూరాబాద్ ఫిర్యాదుదారులకు స్పెషల్ కౌంటర్..

దళితబంధుపై ఫిర్యాదు చేయడానికి హుజూరాబాద్​ నుంచి ఎక్కువగా ఫిర్యాదుదారులు వస్తుండటంతో ప్రత్యేకంగా స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశారు. దళిత బంధులో లోపాలు ఉన్నా, యూనిట్లు మంజూరు కాకున్నా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. అయితే జిల్లా నుంచి వచ్చిన వారంతా ఈ కేంద్రంలోనే అడుగుతున్నారు. కేవలం హుజూరాబాద్ కు మాత్రమే కాదు, జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులు స్వీకరించాలని కోరుతున్నారు.  

టెక్నికల్ ఇష్యూస్ తో..  

దళితబంధు కోసం దరఖాస్తు చేసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుమారు 800 మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.  పథకం ప్రారంభిచిన కొత్తలో అందరికీ ఖాతాలు ఓపెన్ చేయించి వారి అకౌంట్లలో రూ.10లక్షలు జమ చేశారు. తర్వాత అన్ని రకాలుగా చెక్ చేస్తూ యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. ఇందులో కొందరికి ముందుగానే యూనిట్లు ఎంచుకున్నా కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల యూనిట్లు రాలేదు.       

చెరువును కాపాడాలని ఫిర్యాదు..

గోదావరిఖని:  జనగామ శివారు అడ్డగుంటపల్లి చెరువు శిఖంలోని సుమారు 40 ఎకరాల స్థలం కబ్జాకు గురైందని, స్థలాన్ని కాపాడాలని రామగుండం కార్పొరేషన్‌‌‌‌ టీఆర్‌‌‌‌ఎస్, బీజేపీ కాంగ్రెస్‌‌‌‌ కార్పొరేటర్లు మేకల సదానందం, బొడ్డు రజిత, దుబాసి లలిత, నగునూరి సుమలత సోమవారం ప్రజావాణిలో  కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్‌‌‌‌ టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌, రెవెన్యూ ఆఫీసర్లు, సిబ్బంది కొంత మంది కబ్జాదారులకు అండగా ఉంటూ ఇండ్ల నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. భూముల రేట్లు పెరగడంతో ఈ ప్రాంతంపై కన్నేసిన కొందరు చెరువును కబ్జా చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు.