మల్కాజిగిరి, వెలుగు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండి, విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీట్లు ఫుల్అయిపోయాయి. దోస్త్ అడ్మిషన్ల మూడో విడత పూర్తయ్యే సరికి కాలేజీలో ఒక్క సీటూ మిగలలేదు.
మొత్తం 600 సీట్లు ఉండగా.. 2024లో 360, 2025లో 499, ఈ విద్యాసంవత్సరం 600 సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయని ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రాజు తెలిపారు.
బీఏలో 120 , బీకామ్‌లో 240, బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో 120, బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో 120 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని చెప్పారు. కాలేజీలో సీనియర్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లతో టీచింగ్, వర్క్‌షాప్‌లు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, జాబ్ మేళాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్ నిర్వహిస్తుండటంతో ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు తమ కాలేజీని మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు.
