సిటీకి తిరిగొస్తున్న ఐటీ ఉద్యోగులు

సిటీకి తిరిగొస్తున్న ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు: ఐటీ ఉద్యోగులు ఒక్కొక్కరుగా తిరిగి ఆఫీసులకు వస్తుండడంతో సిటీలోని ఇండ్లకు డిమాండ్ పెరిగింది. జూన్ నుంచే కొన్ని కంపెనీలు వారంలో  రెండు రోజులు, మరికొన్ని కంపెనీలు పూర్తిస్థాయిలో ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ప్రకటించాయి. దీంతో చాలా మంది సిటీకి రిటర్న్ అవుతున్నారు. గతంలో లాగా హాస్టళ్లు, పీజీల్లో కాకుండా ఎక్కువ శాతం మంది రూములు, ఫ్లాట్లలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సింగిల్ రూమ్, వన్‌‌ బీహెచ్‌‌ కే, టూబీహెచ్‌‌కే ఫ్లాట్‌‌లకు డిమాండ్ కనిస్తోంది. ఇదే అదునుగా ఇండ్ల ఓనర్లు 10 నుంచి 15 శాతం రెంట్లు, మెయింటెనెన్స్ చార్జీలను పెంచారు. గతంలో కంటే హాస్టళ్లలోనూ ఫీజులు పెంచేయడంతో ఫ్లాట్లలో ఉండటమే మంచిది అనిపిస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. 

అక్కడి కంటే..

పూర్తిస్థాయి ఉద్యోగులతో చిన్న కంపెనీలు నడుస్తుండగా, ఎంఎన్‌‌సీలు హైబ్రిడ్ మోడల్ కంటిన్యూ చేస్తున్నాయి. దీని ప్రకారం కచ్చితంగా వారంలో రెండు రోజులు ఆఫీసులకు వెళ్లాల్సి ఉంది. తమ ఊళ్ల నుంచి వచ్చి ఆఫీసులకు వెళ్లడం అసాధ్యమని భావించి ఉద్యోగులు తిరిగి సిటీకి వచ్చేస్తున్నారు. కొవిడ్ కేసులు పూర్తిగా తగ్గకపోవడంతో హాస్టళ్లలో కంటే ఫ్లాట్లలో ఉండటమే మంచిదని భావిస్తున్నారు. మాదాపూర్, కొండాపూర్, అమీర్ పేట, గచ్చిబౌలి, మియపూర్, ప్రగతినగర్, బాచుపల్లి, కూకట్​పల్లి, మణికొండ ప్రాంతాల్లో ప్రస్తుతం రూములు, ఇండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మొన్నటి దాకా సిటీలో ఎక్కడ చూసినా టు– లెట్ బోర్డులే కనిపించేవి. ఉద్యోగుల రాకతో అద్దె ఇండ్లకు డిమాండ్ మళ్లీ మొదలైంది. 

ఇద్దరు.. ముగ్గురు కలిసి

రెండేండ్ల కిందట సింగిల్‌‌ రూముకు ఏరియాని బట్టి రూ.5 వేల నుంచి 7 వేలు, వన్‌‌బీ హెచ్‌‌కేకి రూ.8 వేల నుంచి 10 వేలు, టూబీహెచ్‌‌కేకి రూ.12వేల నుంచి 15 వేలు రెంట్లు ఉండేవి. కొన్నిచోట్ల నెల, ఇంకొన్ని చోట్ల రెండు నెలల అడ్వాన్సుతో రెంటుకు దొరికేవి. అయితే ప్రస్తుతం ఇండ్ల ఓనర్లు 10 నుంచి 15 శాతం రెంటు పెంచేశారు. రెండు నెల అడ్వాన్స్ కట్టాలని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. అయినప్పటికీ ఫ్లాట్లలో ఉండేందుకే ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదివరకు హాస్టల్​లో ఒకరికి రూ.5వేలు నుంచి 6వేలు ఫీజు ఉండేది. లాక్​డౌన్​తర్వాత గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్​పల్లి, అమీర్‌‌‌‌పేట ఏరియాల్లోని హాస్టళ్ల నిర్వాహకులు ఫీజులు పెంచేశారు. ఒక్కొక్కరికి 8వేల నుంచి 9 వేలు ఫీజు తీసుకుంటున్నారు. కొన్నింటిలో రూ.5వేలు ఫీజు ఉన్నప్పటికీ 5 షేరింగ్, 4 షేరింగ్​రూముల్లో ఉండాలి. దీంతోనే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఫ్లాట్ తీసుకుంటే ఖర్చులు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. అలాగే కుటుంబంతో రిటర్న్ అవుతున్నవారు తప్పనిసరిగా టూబీహెచ్‌‌కే తీసుకోవాలని చూస్తున్నారు. 

ఫుల్​అవడం లేదు

ప్రస్తుతం మా హాస్టల్‌‌లో 30 శాతం రూములు మాత్రమే ఫిల్​ అయ్యాయి. హైబ్రిడ్ వర్క్ మోడల్ వల్ల చాలా మంది హాస్టళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరో వైపు కరోనా భయం ఇంకా పోలేదు. అందుకే చాలామంది ఫ్లాట్స్‌‌ తీసుకుని ఉండాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు పేరెంట్స్ భయపడేవారు. కానీ ఇప్పుడు వాళ్లు కూడా ఒప్పుకుంటుండటంతో ఆఫీసులకు దగ్గర్లో రూములు తీసుకుని ఉంటున్నారు. దీంతో హాస్టళ్లలో ఆక్యుపెన్సీ ఫుల్ అవడం లేదు.

– కరుణాకర్, హాస్టల్ ఓనర్, గచ్చిబౌలి

ఆగస్టు నుంచి ఆఫీస్‌‌కు..

రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాను. ఆగస్టు నుంచి ఆఫీసుకు రావాలని చెప్పారు. దీంతో ముందుగానే సిటీలో అకామిడేషన్​కోసం వెతుకుతున్నాను. తెలిసిన వాళ్లందరినీ అడుగుతున్నాను. నా ఆఫీసు గచ్చిబౌలికి దగ్గర్లో ఉంటుంది. అందుకే ఆ చుట్టుపక్కల రూములు చూస్తున్నా. 

– ఇర్ఫాన్, ప్రైవేట్ ఎంప్లాయ్, వరంగల్

ఇలా అయితే ఖర్చు తగ్గుతుంది

మా ఆఫీసులో హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. అయితే వారం వారం ఊరికి వెళ్లిరావడానికి చాలా ఖర్చవుతుంది. అందుకే ఇక్కడే సింగిల్​ బెడ్రూం ఇల్లు తీసుకోవాలని చూస్తున్నాను. మాదాపూర్, హైటెక్‌‌సిటీ ఏరియాల్లో ఉండేలా ప్లాన్ ​చేస్తున్నా. ప్రస్తుతం వన్‌‌ బీహెచ్‌‌కేకు రూ.12 వేలు, ప్లస్​మెయింటెనెన్స్ ఉంది. కానీ హాస్టల్ కంటే ఇద్దరు, ముగ్గురు కలిసి ఫ్లాట్ తీసుకుంటే మంచిదనిపిస్తోంది.

– ఆంజనేయులు, ప్రైవేట్ ఎంప్లాయ్, కూకట్​పల్లి