వేడి నీళ్ల ఎఫెక్ట్.. లక్షల పక్షులు బలి

వేడి నీళ్ల ఎఫెక్ట్.. లక్షల పక్షులు బలి

అలస్కా నుంచి మెక్సికో దాకా.. పసిఫిక్ మహాసముద్ర తీరంలో1600 కిలో మీటర్ల ఏరియా అది. ఐదేండ్ల కిందట ఉన్నట్టుండి చేపలు కనిపించకుండా పోయాయి. లోకల్‌గా ఫిష్ ​ఇండస్ట్రీ దాదాపు మూతబడిపోయింది. ఏడాది గడిచేసరికి.. తీరానికి వేలాది పక్షులు కొట్టుకురాసాగాయి. మరో ఏడాది గడిచేసరికి.. తీరంలో ఎటుచూసినా కళేబరాలే! వేలు కాదు. లక్షల కొద్దీ పక్షులు, జంతువులు చచ్చిపోయి కన్పిస్తున్నాయి! ఏడాదిలో పది లక్షల పక్షులు చచ్చిపోయాయి. అసలేం జరిగిందక్కడ? సముద్రంలోని నీళ్లు వేడెక్కాయట. దాంతో తిండి కరువై ఇలా లక్షలాది మూగజీవులు చచ్చిపోయాయట. యూనివర్సిటీ ఆఫ్​వాషింగ్టన్ రీసెర్చర్ల స్టడీలో ఈ విషయం తేలింది. ఆ మొత్తం ప్రాంతంలో వేడెక్కిన నీళ్లను ‘బ్లాబ్‌’ అని పిలుస్తున్నారు సైంటిస్టులు. అంటే జిగటలా ఉండే ఓ జీవి పేరును దానికి పెట్టారు.

ఏం జరిగిందంటే..

ఉత్తర అమెరికా పశ్చిమ తీరంలో 2013 నుంచి 2016 మధ్య సముద్ర జలాలు వేడెక్కాయి. టెంపరేచర్ నార్మల్ కన్నా 3 నుంచి 6 డిగ్రీల వరకు ఎక్కువగా పెరిగాయి. దాదాపుగా అలస్కా నుంచి మెక్సికో వరకూ నీళ్లు వేడెక్కాయి. దీనివల్ల సముద్రంలో ఎకో సిస్టం తీరే మారిపోయింది. చేపలు, ఇతర సముద్ర జీవులకు ఆహారంగా ఉపయోగపడే మంచి ఆల్గేకు బదులుగా సముద్రాల్లో ఆక్సిజన్‌ను వేగంగా హరించివేసే చెడు ఆల్గే విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆల్గే మీద ఆధారపడిన చిన్న చేపలు, రొయ్యలు, వేల్స్ వరకూ చాలా జీవులకు ఫుడ్ దొరకడం కష్టమైంది. మరోవైపు ఈ ఆల్గేను తినడం, టెంపరేచర్లు పెరగడం వల్ల సాల్మన్, కాడ్, హాలిబట్ చేపలకు ఆకలి విపరీతంగా పెరిగిపోయిందట. ఫలితంగా చిన్న చేపలను పెద్ద చేపలు ఎక్కువగా తినేశాయి. కేవలం చిన్న చేపలపైనే ఆధారపడి బతికే సముద్ర పక్షులు, సీ లయన్స్ వంటివి చివరకు తిండికి కరువై ఆకలితో చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2015 బ్రీడింగ్ సీజన్‌లో రీసెర్చర్లు 3 కామన్ ముర్రే కాలనీలను పరిశీలించారు. మూడు కాలనీల్లో ఒక్కటంటే.. ఒక్క పక్షి కూడా గుడ్లు పెట్టలేదట. 2016 నాటికి ఇలాంటి కాలనీల సంఖ్య 12కు చేరి ఉంటుందని చెప్తున్నారు. ఉన్నవి చచ్చిపోతుండటం, కొత్తవి పుట్టకపోవడంతో వీటి సంఖ్య తగ్గిపోతోందని చెబుతున్నారు.