మూడో ప్రపంచ యుద్ధానికి చైనా రెడీ అవుతోందా : పెంటగాన్ కంటే 10 రెట్ల పెద్ద ఆర్మీ సిటీ నిర్మాణం ఎందుకు..?

మూడో ప్రపంచ యుద్ధానికి చైనా రెడీ అవుతోందా : పెంటగాన్ కంటే 10 రెట్ల పెద్ద ఆర్మీ సిటీ నిర్మాణం ఎందుకు..?

World War 3: పైకి అభివృద్ధి చెందుతున్న దేశం అనే బోర్డు పెట్టుకుని ప్రపంచాన్ని శాశించే స్థాయిలకు చేరుకున్న చైనా చాపకింద నీరులా అనేక రంగాల్లో విస్తరిస్తోంది. తాను కోరుకున్నప్పుడు, కోరుకున్న విధంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను మందగించేలా చేసేందుకు చైనా తన ముఖ్యమైన ఉత్పత్తులు, టెక్నాలజీ, కాంప్లెక్స్ మెషినరీ విక్రయాలను ప్రస్తుతం ఆయుధంగా మార్చుకుంది. ఇదే సమయంలో పెద్దన్న అమెరికాను సైతం ఆర్థికంగా ఎప్పుడో దాటేసింది అనేది ఆర్థికవేత్తలు తరచుగా చెబుతుండే మాట. ఈ క్రమంలో చైనా సైలెంట్ గా చేస్తున్న మరో ప్రాజెక్ట్ ప్రపంచం దృష్టిని ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. 

చైనా అమెరికాలోని పెంటగాన్ కంటే 10 రెట్లు పెద్దదైన సైనిక నగరాన్ని నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. రహస్యంగా బీజింగ్ దగ్గర్లో చేపడుతున్న సైనిక సముదాయానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు తాజాగా బయటకు రావటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందులో పెంటగాన్ వద్ద ఉన్న 148 ఎకరాల సైనిక స్థావరం కంటే 10 రెట్లు పెద్దదైన మిలిటరీ సముదాయాన్ని చైనా 1500 ఎకరాల్లో రహస్యంగా నిర్మిస్తోందని తేలింది. 

బీజింగ్ నగరానికి నైరుతి దిశలో 32 కిలోమీటర్ల దూరంలో చైనా తన కొత్త మిలిటరీ సిటీని కడుతోంది. ఇది దాదాపు 4 చదరపు కలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. దీనిలో డూమ్స్‌డే బంకర్ కూడా ఉంది. వాస్తవానికి దీనిని అణు యుద్ధాల సమయంలో కమాండ్ సెంటర్ గా ఉపయోగించవచ్చు. 2022లో ఈ ప్రాంతంలో నివాస భవనాలు ఉండగా గత ఏడాది చివరి నాటికి వాటిని చైనా ప్రభుత్వం పూర్తిగా ఖాళీ చేయించింది. ప్రస్తుతం అక్కడ రోడ్లు, సొరంగాలను నిర్మిస్తోంది. దీనిపై చైనా బయటకు పొక్కకుండా నిర్మిస్తుండగా.. చైనా రాయబార కార్యాలయం కూడా తమకు దీని గురించి ఏమీ తెలియదంటూ దాటవేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రాంతంలో డ్రోన్లు నిషేధించబడ్డాయి. ప్రాజెక్టును గోప్యంగా ఉంచేందుకు కెమెరా సర్వేలెన్స్, నిఘాలను నిలిపివేసింది. 

రానున్న దశాబ్ధకాలంలో చైనా అణ్వాయుధాల బలం అమెరికాతో సమానంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చైనా దూకుడుగా సైనిక నిర్మాణాలు మూడో ప్రపంచ యుద్ధం కోసమేనా అనే అనుమానాలను డిఫెన్స్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. చైనా చర్యలు నిఘా సంస్థలు, అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తుండగా.. అమెరికా కూడా దీనిని నిశితంగా పరిశీలిస్తు్న్నట్లు సమాచారం. బీజింగ్ బిజీగా ఈ మెగా మిలిటరీ ప్రాజెక్టు చేపట్టడం పాత వెస్ట్రన్ హిల్స్ కమాండ్ సెంటర్‌ను భర్తీ చేసేందుకే అనే వాదనలు కూడా ఉన్నాయి.