కోళ్ల పెంట లారీని ఆపి చెక్ చేస్తే ఏం కనిపించాయంటే..

కోళ్ల పెంట లారీని ఆపి చెక్ చేస్తే ఏం కనిపించాయంటే..
  • 9 వేల 6 వందల మద్యం బాటిళ్లు..

పశ్చిమ గోదావరి జిల్లా: మద్యం స్మగ్లర్లు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నారు. పోలీసులు దాడులు చేసి ఎన్నిసార్లు కేసులు పెట్టినా.. అక్రమ మద్యం రవాణా ఆగడం లేదు. ఏకంగా యావజ్జీవ శిక్షలు విధించేలా ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చినా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం పోటెత్తుతూనే ఉంది. జిల్లాలోని లింగాల పాలెం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా భారీగా అక్రమ మద్యం పట్టుపడింది. కోళ్ల పెంట లోడుతో వెళ్తున్న లారీని అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. పెంట కింద దాచిన మద్యం బాటిల్లు బయటపడ్డాయి. తెలంగాణలో ఏపీ కంటే తక్కువ ధరకే మద్యం దొరుకుతుండడంతో పలువురు నేరస్తులు స్మగ్లర్ల అవతారం ఎత్తినట్ల తెలుస్తోంది. సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశంగా భావిస్తూ కొత్త కొత్త మార్గాల్లో మద్యం అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం. ఇదే కోవలో పలువురు మాజీ నేరస్తులపై నిఘా పెట్టిన పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు కోడి పెంట తో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు.  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా కోళ్ల పెంట కింది భాగంలో 9600 మద్యం బాటిళ్లు బయటపడ్డాయి.  పోలీసులు వీటిని సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు.