భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం

భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం

నిర్మల్, వెలుగు : వర్షం తగ్గినా వరద ప్రభావం నుంచి నిర్మల్ ​జిల్లాలోని కడెం, దస్తూరాబాద్​ మండలాలు ఇప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. కడెం మండలంలోని కన్నాపూర్, అంబారి పేట్, కడెం, పాండవాపూర్, కొండుకూర్, దస్తురాబాద్ మండలంలోని గొడిసిరియాల్, గొండు గూడా, మున్యాల్, మున్యాల్ గోండు గూడా, దేవునిగూడెం, రాంపూర్, భూత్కూర్ తదితర గ్రామాల్లో చేరిన బురద తొలగిపోయేందుకు నెల రోజులైనా పడుతుందని గ్రామస్తులంటున్నారు. పొలాల్లో ఇసుకమేటలు వేయడం బురద చేరడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది కూడా పారిశుద్ధ్య పనులు మొదలుపెట్టారు.   

విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం 

భారీ వర్షాలతో ట్రాన్స్ కోకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు మండలాల్లో సుమారు రూ.2 కోట్ల కు పైగా నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరో రూ. రెండు కోట్లకు పెరగవచ్చంటున్నారు. కరెంటు లైన్లతో సహా మొత్తం 180కి పైగా స్తంభాలు నేల కూలాయి. 12 ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయినట్లు గుర్తించారు. కొన్ని గ్రామాలకు కరెంట్​సరఫరా పునరుద్ధరించినప్పటికీ పొలాలకు పూర్తిస్థాయిలో సరఫరా చేయాలంటే టైం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దస్తురాబాద్ మండలంలోని కొన్ని గ్రామాలకు సరఫరా స్టార్ట్​ చేశామని, మిగిలిన గ్రామాలతో పాటు కడెం మండలంలోని ఊర్లకు కరెంట్​ ఇవ్వడానికి రెండు రోజులు పట్టవచ్చని నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ జైవంత్ చౌహాన్ తెలిపారు.  

గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు

పునరావాస కేంద్రాలకు తరలిపోయిన జనాలు ఇప్పుడిప్పుడే కాలనీలకు చేరుకుంటుండగా వైద్య ఆరోగ్యశాఖ హెల్త్​క్యాంపులు నిర్వహిస్తోంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో జ్వరాల ప్రభావం కనిపిస్తోందని, బాధితులను గుర్తించి రక్త పరీక్షలు చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. జ్వరం వచ్చిన వారి  ఇండ్లకు వెళ్లి మందులు అందజేస్తున్నామన్నారు.  

పొలాల్లో ఇసుక మేటలతో తిప్పలు 

పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నష్టం అంచనా వేసే పనిలో పడ్డాయి. ప్రస్తుతం రెండు మండలాల్లో 6 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు భావిస్తున్నామని, మరో 10 రోజుల తర్వాత పూర్తి స్థాయి అంచనాకు రాగలుగుతామని అధికారులు అంటున్నారు. చాలా గ్రామాల్లోని పొలాల్లో కనుచూపుమేర ఇసుకమేటలు కనిపిస్తున్నాయి. వీటిని తొలగించడం రైతులకు ప్రధాన అవరోధంగా మారింది. వానాకాలం సీజన్ లో పెట్టిన పెట్టుబడులన్నీ వరద కారణంగా కోల్పోయామని, మళ్లీ పంట చేలను చదును చేయడం, నాట్లు వేయడం, తోట భూములు చేలల్లో విత్తనాలు వేయడం తలకు మించిన భారమవుతోందని అంటున్నారు. పంట నష్టపరిహారంతో పాటు సబ్సిడీ విత్తనాలు ఇస్తే గాని మళ్లీ సేద్యం చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు.