స్మశానంలో అంత్యక్రియలకు ఇష్టానుసారం వసూళ్లు 

స్మశానంలో అంత్యక్రియలకు ఇష్టానుసారం వసూళ్లు 

 

  • ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్: కరోనా నేపధ్యంలో సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నోచుకోలేని దుస్థితి నెలకొంది. రెట్టింపు సంఖ్యలో వస్తున్నశవాలకు సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు జరపడం బంధువులకే కాదు.. స్మశానవాటికల నిర్వాహకులకు సైతం ఇబ్బందులపాలు చేసున్న ఘటనలు ప్రతిరోజూ.. వింటూనే ఉన్నాం.. చూస్తూనే ఉన్నాం. దేశంలో దాదాపు ప్రతి స్మశాన వాటిక వద్ద అంత్యక్రియల ప్రక్రియ ప్రహసనంగా మారింది. మాయదారి కరోనా మహమ్మారి కనీసం కడసారి యాత్రనైనా జరుపుకోలేని దుస్థితిని తీసుకొచ్చిందని నిరుపేదలు, సామాన్యులు కంటతడిపెట్టకుండా స్మశానం దాటి వెళ్లని వారు బహుశా అరుదు అని చెప్పుకోవచ్చు. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు స్పందించి అంత్యక్రియలకు, అంతిమ సంస్కారాలకు రేట్లు కూడా ఖరారు చేసి ఆదేశాలిచ్చారు. అయినా వసూల్లు మాత్రం ఆగిన దాఖలాలు కనిపించడం లేదు.

ఈ నేపధ్యంలో బాధితుల ఆవేదనలపై అధికారులు స్పందించిన తొలి ఘటన మన హైదరాబాద్ మహానగరంలోనే బుధవారం చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంత్యక్రియలకు ఎక్కువ డబ్బులు వసూలు చేసినందుకు పోలీసు కేసు నమోదు అయింది. అంబర్ పేట స్మశానవాటికలో ఈనెల 22వ తేదీన జరిగిన ఒక దహన కార్యక్రమానికి  30 వేల రూపాయలు వసూలు చేశారు. దీనిపై బాధితులు  ఇద్దరు వ్యక్తులపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిహెచ్ఎంసి మెడికల్ ఆఫీసర్ హేమలత స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కట్టెలపై దహన సంస్కారాలకు కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే చెల్లించాలి. అదే విద్యుత్ దహన వాటిక లో అయితే నాలుగు వేల రూపాయలు మాత్రమే చెల్లించాలి...కరోనా లేని మృతదేహాలను కట్టెలపై దహనం చేసేందుకు ఆరు వేల రూపాయలు మాత్రమే చెల్లించాలి. ఇంతకు మించి ఎక్కడైనా వసూలు చేసినట్లయితే ఫిర్యాదు చేయాలని జీహెచ్ ఎంసీ మెడికల్ ఆఫీసర్  హేమలత సూచించారు.