సెమీ కండక్టర్ మార్కెట్లో భారీ అవకాశాలు

సెమీ కండక్టర్ మార్కెట్లో భారీ అవకాశాలు

న్యూఢిల్లీ: భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ 2035 నాటికి 300 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.25.2 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ వెల్లడించింది. దీని రిపోర్ట్​ ప్రకారం..ఏఐ వాడకం పెరగడం, వాహన రంగం వృద్ధి, డేటా సెంటర్ల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలు. ప్రస్తుతం మన దేశ అవసరాల్లో 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అయితే 2035 చివరి నాటికి దేశీయ అవసరాల్లో 60 శాతం స్థానిక ఉత్పత్తి ద్వారానే లభిస్తాయని అంచనా. దీనివల్ల 2035 నాటికి సుమారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ఇందులో 30 శాతం తయారీ రంగంలో, 30 శాతం డిజైన్ సేవల్లో, మరో 40 శాతం ఇతర విభాగాల్లో ఉంటాయి. గత మూడేళ్ల నుంచి ఈ రంగం 20 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రభుత్వం పలు పథకాల ద్వారా చిప్స్​తయారీదారులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలోకి అదనంగా 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని డెలాయిట్ వివరించింది.