ముదిరాజ్​లను విస్మరించే పార్టీలను బొంద పెడ్తం .. ధర్మ యుద్ధం పేరుతో ముదిరాజ్​ల భారీ ర్యాలీ

ముదిరాజ్​లను విస్మరించే పార్టీలను బొంద పెడ్తం .. ధర్మ యుద్ధం పేరుతో ముదిరాజ్​ల భారీ ర్యాలీ
  • బీఆర్ఎస్​ ప్రకటించిన లిస్టులో ఒక్క ముదిరాజ్ లేడు
  • పట్టించుకోకపోతే కామారెడ్డిలో కేసీఆర్​పై నామినేషన్లు వేస్తం

కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు: తమను విస్మరించే ఏ పార్టీనైనా వచ్చే ఎన్నికల్లో బొంద పెడతామని ముదిరాజ్ ​కులస్తులు హెచ్చరించారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ‘ధర్మ యుద్ధం’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్​నుంచి మొదలైన ర్యాలీ కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, స్టేషన్, సిరిసిల్ల, జేపీఎన్, సుభాష్​నగర్​రోడ్ల మీదుగా సాగింది. దారిలో అంబేద్కర్, జ్యోతిబాఫూలే విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్​కిష్టయ్య విగ్రహానికి నివాళి అర్పించారు. కొద్ది సేపు నిజాంసాగర్​చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో  అత్యధికంగా ఉన్న ముదిరాజ్​కు బీఆర్ఎస్​ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం దారుణం అన్నారు.

ఇటీవల ఆ పార్టీ ప్రకటించిన 115 మందిలో ఒక్క ముదిరాజ్​ కూడా లేరని మండిపడ్డారు. కనీసం నామినేటెడ్ పోస్టులు, జడ్పీ చైర్మన్​ పదవులు ఇవ్వడం లేదన్నారు. బీసీ–డిలో ఉన్న తమను బీసీ–ఎలోకి మార్చాలని, ముదిరాజ్​కార్పొరేషన్​ఏర్పాటు చేయాలని డిమాండ్​చేశారు. భూమి లేని​పేదలకు 3 ఎకరాలు, మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ ​సహా అన్ని రాజకీయ పార్టీలు తమపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికల్లో తగినన్ని సీట్లు కేటాయించకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్​స్పందించి తమ సమస్యలు పరిష్కరించకుంటే కామారెడ్డిలో ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు. 

కామారెడ్డి, ఎల్లారెడ్డి, గజ్వేల్​నియోజకవర్గాలతో పాటు చాలాచోట్ల అత్యధిక ఓట్లు ముదిరాజులవేనని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్​ నిజ్జన రమేశ్, అబ్రబోయిన స్వామి, సూర్యప్రసాద్, చింతల నీలకంఠం, భూపాల్​విజయానంద్, పిల్లి మల్లేశ్, కాకర్ల శేఖర్, శంకర్, కుడుముల సత్యం, బైండ్ల పోచయ్య, రాజ్​దాస్, తూర్పు రాజు పాల్గొన్నారు.