రాజన్న దర్శనానికి 6 గంటలు

రాజన్న దర్శనానికి 6 గంటలు

కార్తీక తొలి సోమవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు
అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం

వేములవాడ, వెలుగు: కార్తీక తొలి సోమవారం సందర్భంగా సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటలకు క్యూలోకి వెళ్లిన భక్తులకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా దర్శనం కాలేదు. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల తాగేందుకు కనీసం మంచినీళ్లు కూడా లేవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లలో టాయిలెట్స్ వసతి లేకపోవడంతో నరకం చూశామని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందితో గొడవకు దిగడంతో ఎమర్జెన్సీ గేట్​నుంచి పంపించారు.  కొబ్బరికాయ కొట్టాలంటే రూ.10, కల్యాణకట్టలో మొక్కుబడి చెల్లించాలంటే రూ.20 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

కార్తీక దీపాలు వెలిగించాలన్నా, కొడె మొక్కు చెల్లించాలన్నా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని వాపోయారు. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. వసతి గదులు నిండిపోవడంతో ఆదివారం రాత్రికే వేములవాడ చేరుకున్న భక్తులుఆలయ ప్రాంగణంలో వేచి ఉన్నారు. ఏర్పాట్లపై ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ ​స్పందిస్తూ.. తొలి కార్తీక సోమవారం కావడంతో తమ అంచనాకు మించి భక్తులు వచ్చారన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమించామని చెప్పారు. గర్భగుడి దర్శనాలు ఉండడంతో భక్తులకు కొంద ఇబ్బంది జరిగిందని, మరోసారి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.