టీఆర్ఎస్ ఎమ్మెల్యే ర్యాలీతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ర్యాలీతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం

రోడ్డుపై సడెన్ గా రెండు, మూడు వాహనాలు ఆగితేనే ట్రాఫిక్ జామ్ అయ్యి...జనాలు ఇబ్బంది పడడం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ విశేషమేమిటంటే... ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన అధికారులే.. తమ పోలీస్ జీపును వాహనాలకు అడ్డుగా పెట్టి మరీ ట్రాఫిక్ జామ్ మరింత తీవ్రం చేశారు. దీనికి కారణం .. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ర్యాలీ.  విదేశీ పర్యటనను ముగించుకొని ఇండియాకు వచ్చిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య కోసం కార్యకర్తలు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఆయనకు గజమాల వేసి సత్కరించారు. పేపర్ బ్లాస్ట్ లు, టపాకాయల సందడితో కొద్దిసేపటి వరకూ ఆ రోడ్డంతా పెద్ద శబ్దాలతో, ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. కాగా ఇటీవల అమెరికాలో జరిగిన అమెరికన్ తెలుగు కన్వెన్షన్ ఆటా సభలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య హాజరయ్యారు. దానికే ఒలంపిక్స్ గేమ్స్ లో బంగారు పతకం సాధించినట్టు ఆయనకు అభిమానులు, పార్టీ నాయకులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. అందులో భాగంగా భారీ ర్యాలీగా వచ్చిన  బైకులు, కార్లతో రోడ్డంతా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. ఎమ్మెల్యే.. అందులోనూ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు కూడా.. వాహనాలను ఆపి ప్రజలకు చుక్కలు చూపించారు.