3 కిలోమీటర్లు టీఆర్ఎస్ ఫ్లెక్సీలు

3 కిలోమీటర్లు టీఆర్ఎస్ ఫ్లెక్సీలు

కేటీఆర్​ కార్యక్రమానికి కూకట్ పల్లిలో భారీగా హోర్డింగులు 

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ కూకట్ పల్లి టూర్ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. మంగళవారం కైత్లాపూర్‌‌ ఫ్లైఓవర్‌‌ ఓపెనింగ్‌‌కు కేటీఆర్‌‌ వస్తున్నారంటూ దారి పొంట మొత్తం బ్యానర్లు కట్టారు. కూకట్‌‌పల్లి చౌరస్తా నుంచి కైత్లాపూర్‌‌ ఫ్లైఓవర్‌‌ వరకు మూడు కిలోమీటర్ల మేర చాలా చోట్ల పెద్ద ఎత్తున గులాబీ జెండాలు ఏర్పాటు చేశారు. బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాల్లోనూ భారీగా కటౌట్లు పెట్టారు. వీటి ఏర్పాటు కోసం టీఆర్‌‌ఎస్‌‌ కార్పొరేటర్లు, ఇతర లీడర్లు పోటీ పడ్డారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కేటీఆర్ చెప్పినా, గ్రేటర్ లో వాటిపై నిషేధం ఉన్నా టీఆర్ఎస్ నేతలు మాత్రం తగ్గేదేలే.. అన్నట్టుగా రోడ్డంతా ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లతో నింపేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంత పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టినా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతిపక్ష నేతలు ఏర్పాటు చేస్తే వెంటనే కొరడా ఝులిపించే బల్దియా అధికారులు.. అధికార పార్టీ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కర్రీ పాయింట్, ట్యూషన్ క్లాసులు అంటూ చిన్న చిన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తేనే రూ.5 వేల జరిమానా వేసే అధికారులకు టీఆర్ఎస్ నేతలు ఇంత పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా కనిపించడం లేదా? అని జనం మండిపతున్నారు. 

గతంలో రెండుసార్లూ ఇంతే... 

ఈ ఏడాది ఏప్రిల్‌‌ 27న టీఆర్‌‌ఎస్‌‌ 21వ ప్లీనరీ, నిరుడు అక్టోబర్‌‌ 25న పార్టీ ప్రతినిధుల సభ సందర్భంగా గ్రేటర్‌‌ సిటీని గులాబీ ఫ్లెక్సీలతో ముంచెత్తారు. ఆ సమయంలో ‘‘ఈ–చాలన్‌‌ జనరేటర్‌‌ సిస్టం’’ సర్వర్‌‌ ప్రాబ్లమ్ పేరుతో మూగబోయింది. ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ వింగ్‌‌ హెడ్‌‌గా ఉన్న ఐపీఎస్‌‌ అధికారి విశ్వజిత్‌‌ కంపాటి.. ఆ రెండు సందర్భాల్లోనూ సెలవులో వెళ్లారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌‌లపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే కారణంతోనే ఆయన సెలవుపై వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో బల్దియా అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ట్విట్టర్‌‌లో వచ్చిన కంప్లయింట్లను పరిగణనలోకి తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లకు జరిమానాలు వేశారు. 

ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సైలెంట్.. 

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను కట్టడి చేసేందుకు బల్దియా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ విభాగం ‘‘ఈ-చాలన్‌‌ జనరేటర్‌‌ సిస్టం’’ను తీసుకొచ్చింది. ట్విట్టర్‌‌లో వచ్చే కంప్లయింట్ల ఆధారంగా జరిమానాలు విధిస్తోంది. ఈ బాధ్యత సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్(సీఈసీ)పై ఉంది. ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలోనే సీఈసీ పని చేస్తోంది. ట్విట్టర్ లో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి ఫైన్లు వేస్తోంది. అయితే అధికార పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ వింగ్ సరిగా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

రూ.30 లక్షల ఫైన్లు.. కట్టింది 5 శాతమే! 

2019 నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలకు రూ.30 లక్షల వరకు ఫైన్లు వేశారు. కానీ ఇందులో ఇప్పటి వరకు 5 శాతమే చెల్లించారు. అయినా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మున్సిపల్‌‌ మంత్రిగా కేటీఆర్‌‌ ఉండటంతోనే గులాబీ నేతలు జరిమానాలు కట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. మంత్రి ఏమన్నా అంటాడేమోనన్న భయంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.