పోటెత్తిన వరద.. కృష్ణా ప్రాజెక్టులకు జలకళ

పోటెత్తిన వరద.. కృష్ణా ప్రాజెక్టులకు జలకళ

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్  ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం 3 లక్షల 22 వేల 262 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం జలాశయంలో 874 అడుగుల వరకు నీరుంది. డ్యామ్  గరిష్ఠ నీటి నిల్వ సామర్థం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 160 టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం వరద ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే డ్యామ్  నిండే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. ఎడమ గట్టు జల విద్యుత్  ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్  ఉత్పత్తి కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్  కు 18 వేల 142 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. సాగర్  పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 539 అడుగులు వరకు నిల్వ ఉంది. 
అటు జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3 లక్షల 35 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు 33 గేట్లను ఎత్తి 3 లక్షల 16 వేల 708 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల గరిష్ఠ నీటిమట్టం 9.657 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 6.325 టీఎంసీల నీరు నిల్వ ఉంది.