ఏపీలో తీగలాగితే .. సూర్యాపేట జిల్లాలో పట్టుబడ్డారు!

ఏపీలో తీగలాగితే .. సూర్యాపేట జిల్లాలో పట్టుబడ్డారు!
  • నకిలీ మద్యం తయారు చేసి ఏపీకి సరఫరా చేస్తున్న ముఠా 
  • నిందితుల నుంచి రూ.15 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం 
  • దాడి చేసి పట్టుకున్న హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు 

మేళ్లచెరువు, వెలుగు: ఏపీలో నకిలీ మద్యం తీగ లాగితే తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో తయారీ ముఠా పట్టుబడింది. హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ జిన్నా నాగార్జునరెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. ఏపీలోని అమలాపురంలో నకిలీ మద్యం అమ్ముతుండగా.. ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు.  గుంటూరు జిల్లా దుర్గికి చెందిన శ్రీరాం మహేశ్​ను నకిలీ మద్యం సరఫరా చేసినట్టు తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో తయారు, సరఫరా చేసి అమ్ముతున్నట్టు తేలింది. 

సోమవారం గ్రామంలోని పాత గోడౌన్ పై దాడి చేసి 831 లీటర్ల స్పిరిట్,327.6 లీటర్ల మద్యంతో నింపిన 38 కాటన్ల బాటిల్స్,11,800 ఖాళీ బాటిల్స్,100 కేజీల బాటిళ్ల మూతలు(క్యాప్స్),7,814 లేబుల్స్, కారు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.15 లక్షల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. 

కాగా.. హైదరాబాద్ కు చెందిన రూతుల శ్రీనివాస్, కృష్ణ ఫార్మాకు చెందిన శివచరణ్ సింగ్ ద్వారా బాటిళ్ల మూతలు, లేబుళ్లు కొనుగోలు చేయడంతో, వీరిద్దరితో పాటు పాత గోడౌన్ ఓనర్ నూకల రామ సూర్య ప్రకాశ్ ను అరెస్ట్ చేయగా, తోట శివశంకర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.  హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్​అంజిరెడ్డి ఆదేశాలతో హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు.