ఇండియా ఇంపాక్ట్ 50 లిస్ట్ లో... హెచ్యూఎల్ నం.1

ఇండియా ఇంపాక్ట్ 50 లిస్ట్ లో... హెచ్యూఎల్ నం.1
  • రెండో స్థానంలో  హెచ్​సీఎల్​
  • హైదరాబాద్​ నుంచి డాక్టర్​ రెడ్డీస్​

హైదరాబాద్​, వెలుగు: పర్యావరణాన్ని కాపాడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న కంపెనీల వివరాలతో పర్పిచ్యువల్ క్యాపిటల్, హురున్ ఇండియా ‘ఇంపాక్ట్50  2026’ పేరుతో హైదరాబాద్​లో రిపోర్టును విడుదల చేశాయి. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో (ఎస్​జీడీలు) భారత కంపెనీల పనితీరును ఇందులో గుర్తించారు. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్​యూఎల్​) ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలవగా హెచ్​సీఎల్ టెక్నాలజీస్ రెండో స్థానం దక్కించుకుంది. 

ముంబై నుంచి అత్యధికంగా 26 కంపెనీలు ఇందులో చోటు సంపాదించాయి. మెటల్స్, మైనింగ్ రంగం నుంచి ఏడు కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. హెచ్​యూఎల్​ 97 శాతం క్లీన్​ ఎనర్జీతో నడుస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా నీటి సంరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించింది. 

డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా వంటి సంస్థలు 2030 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. సామాజిక సేవ (సీఎస్​ఆర్​) కోసం కంపెనీలు సుమారు రూ. ఎనిమిది వేల కోట్లు కేటాయించడంతో 20 కోట్ల మందికి మేలు జరిగిందని రిపోర్టు పేర్కొంది.