
పుష్పా-2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసు మరోసారి తెరపైకి వచ్చింది. బుధవారం (ఆగస్టు 06) అల్లు అర్జున్ పుష్పా 2 ఈవెంట్‌లో రేవతి మృతి కేసుపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. ఈవెంట్‌కు పోలీసుల అనుమతి లేకపోయినప్పటికీ ప్రజలను అనుమతించడంపై కమిషన్ ప్రశ్నించింది. ప్రజల భద్రతకై ముందస్తు చర్యలు తీసుకోలేదని పోలీసులపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి మృతి కేసులో అల్లు అర్జున్, థియేటర్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. క్రైమ్ నం. 376/2024 కింద మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే సంఘటన ముందే ఊహించదగ్గదే అయినా.. ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీసులపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవతి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై ఆరు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.