అన్నలంతా మా పార్టీలోనే ఉన్నరు..తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

అన్నలంతా  మా పార్టీలోనే ఉన్నరు..తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కోల్​బెల్ట్/నస్పూర్/కాగజ్ నగర్, వెలుగు: సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, కార్మికులను ఆఫీసర్లు వేధిస్తే ఊరుకోమని, వారిపై కేసులు పెడతామని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్​) చీఫ్​ కవిత హెచ్చరించారు. గతంలో అన్నలు ఉండడంతో కార్మికులతో ఆఫీసర్లు పద్దతిగా ఉండేవారని, ఇప్పుడు అన్నలు లేరనుకుంటున్నారేమో.. వాళ్లంతా తమ పార్టీలోనే ఉన్నారని చెప్పారు. 

టీఆర్ఎస్, హెచ్​ఎంఎస్​ ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియా బొగ్గు గనుల్లో సింగరేణి బాయిబాట కార్యక్రమం కొనసాగింది. ఆర్కే-7 బొగ్గు గని, ఏరియా వర్క్​షాప్​లో కార్మికులు, ఉద్యోగులతో ఆమె మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగా అండర్ గ్రౌండ్  మైనింగ్  తగ్గించి ఓపెన్  కాస్ట్  మైనింగ్  పెంచుతున్నారని ఫైర్​ అయ్యారు. 

సింగరేణిని ప్రైవేట్  పరం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడుతామన్నారు. తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని, అండర్  గ్రౌండ్  మైనింగ్  చేపట్టి లక్ష మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. లాభాలను సగానికి పైగా దాచేసి వాటాలో కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. 

దేశమంతటా గనుల్లో ఆధునిక టెక్నాలజీ వాడుతుంటే సింగరేణిలో కార్మికులు పాత మెషీన్లను రిపేర్లు చేసుకుంటూ పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 వేల మంది కార్మికులకు 80 వేల క్వార్టర్లు ఉన్నా వాటిని కేటాయించకుండా అఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణికి ఎక్కువ బొగ్గు బ్లాక్​లు వచ్చేలా కృషి చేయాలని కవిత డిమాండ్​ చేశారు.

 శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 మైన్​ను మూసేసే ప్రయత్నం చేస్తే కార్మికవర్గం అడ్డుకొని కాపాడుకుందన్నారు. గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలన్నారు. మాజీ మంత్రి బోడ జనార్ధన్​,హెచ్ఎంఎస్​ నేత రియాజ్​అహ్మద్​ పాల్గొన్నారు.

ప్రాణహిత పనులు మొదలుపెట్టాలి

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని, నిజాయతీ ఉంటే మహారాష్ట్ర అనుమతి విషయం పక్కకు పెట్టి ప్రాజెక్ట్  నిర్మాణం ప్రారంభించాలని కవిత డిమాండ్  చేశారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదిని ఆమె సందర్శించారు. అక్కడ జరిగిన సభలో మాట్లాడుతూ వైఎస్సార్​ మహారాష్ట్ర అనుమతులు లేకుండానే కాలువలు నిర్మించి కాంట్రాక్టర్లకు లబ్ది చేశారని విమర్శించారు.