ఫ్రాన్స్​లో హంగ్... ఏ పార్టీకీ దక్కని మెజారిటీ

ఫ్రాన్స్​లో హంగ్... ఏ పార్టీకీ దక్కని మెజారిటీ
  • లెఫ్టిస్ట్ కూటమికి 180, మాక్రాన్ కూటమికి 160, నేషనల్ ర్యాలీ కూటమికి 160 సీట్లు

పారిస్: ఫ్రాన్స్ లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ మెజారిటీ దక్కలేదు. జాతీయ అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల ఫలితాలను సోమవారం ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్  మార్కు 289కి అన్ని పార్టీల కూటములు దూరంగా నిలిచాయి. ఫ్రాన్స్ నేషనల్  అసెంబ్లీలో మొత్తం 577 సీట్లు ఉన్నాయి.

న్యూ పాపులర్  ఫ్రంట్  లెఫ్టిస్ట్  కూటమి 180 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మోక్రాన్  సెంట్రిస్ట్  కూటమి 160 సీట్లు దక్కించుకొని రెండో స్థానంలో నిలిచింది. ఇక మెరైన్  లా పెన్ కు చెందిన నేషనల్  ర్యాలీ కూటమికి 140 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి మ్యాజిక్  ఫిగర్  దక్కకపోవడంతో దేశంలో హంగ్  ఏర్పడింది. ఈ ఎన్నికల్లోనూ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రెసిడెంట్  ఎమ్మానుయేల్  మాక్రాన్ కు మెజారిటీ సీట్లు ఇవ్వకుండా ఓటర్లు షాక్  ఇచ్చారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాక్రాన్  ఇతర కూటముల మద్దతు తీసుకునే పరిస్థితిని ఓటర్లు కల్పించారు. మొదటి రౌండ్ లో ఆధిపత్యం ప్రదర్శించిన నేషనల్  ర్యాలీ కూటమి చివరకు 140 సీట్లు దక్కించుకొని మూడో స్థానంలో నిలిచింది. ఫలితాలు వెలువడిన తర్వాత రాజీనామా చేస్తానని ప్రధాన మంత్రి గాబ్రియెల్  అటల్  ప్రకటించారు.

రాజీనామా లెటర్ ను ప్రెసిడెంట్  మాక్రాన్ కు పంపారు. అయితే, మరికొద్ది రోజుల్లో దేశంలో ఒలింపిక్  క్రీడలు జరగనున్న  నేపథ్యంలో ఒలింపిక్స్ పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని అటల్ కు మాక్రాన్  విజ్ఞప్తి చేశారు. కాగా.. పార్లమెంటును రద్దచేస్తూ ప్రెసిడెంట్  మాక్రాన్  నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికలు నిర్వహించారు.